`సవ్యసాచి` అంటేనే అర్జునుడు. రెండు చేతులతో బాణాలు సంధించగలడు కాబట్టి.. ఆయనకు ఆ పేరు వచ్చింది. ఆ పేరుతో సినిమా తీస్తూ.. అర్జునుడిని చూపించకపోతే ఎలా..?? అందుకే `సవ్యసాచి` కోసం నాగచైతన్య అర్జునుడిగా మారాడు. అర్జునుడిగా చైతూ పౌరాణిక గెటప్‌లో కనిపించబోతున్నాడు. అర్జునుడు ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు లేకపోతే ఎలా?? ఆ పాత్రని వెన్నెల కిషోర్ పోషించాడు. `సవ్యసాచి`లో అర్జునుడు – కృష్ణుడు మధ్య సాగే ఓ ఎపిసోడ్ ఉంది. దాన్ని…. దర్శకుడు చందూ మొండేటి హిలేరియస్‌గా తీర్చిదిద్దాడని సమాచారం.
ఏ సినిమాకైనా ఎంటర్టైన్మెంట్ చాలా అవసరం. `ప్రేమమ్`లో వినోదాన్ని బాగానే పండించాడు చందూ మొండేటి. `సవ్యసాచి` ఓ యాక్షన్ థ్రిల్లర్. అయితే ఇందులోనూ వినోదాన్ని మిస్ చేయకుండా జాగ్రత్తపడ్డాడట. అందులో భాగంగానే చైతూ – వెన్నెల కిషోర్ మధ్య ఓ డ్రామా సృష్టించాడట. అందులోనే చైతూ అర్జునుడి గెటప్‌లో కనిపిస్తాడు. చైతూ పౌరాణిక గెటప్‌లో ఇంత వరకూ కనిపించిందే లేదు. కిరీటం, ధనస్సు, మెళ్లో కవచాలతో… చైతూ ఎలా ఉంటాడో..? ఈ సీన్‌కి సంబంధించిన మేకింగ్ వీడియోని, పోస్టర్ నీ విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ రోజు రాత్రికి గానీ, రేపు గానీ… ఈ వీడియో బయటకు రావొచ్చు.