నాగచైతన్య మరోసారి వార్తల్లోకి వచ్చాడు. తన కొత్త బంధం ఇప్పుడు టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. సమంతని ప్రేమించి పెళ్లి చేసుకొన్న చైతూ… ఆ తరవాత వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకొన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. మీడియా ముందుకు కూడా రావడం లేదు. అయితే సడన్ గా.. చైతూకి సంబంధించిన ఓ గాసిప్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. చైతూ ఓ కొత్త జోడీని వెదుక్కున్నాడని, ప్రస్తుతం ఓ హీరోయిన్ తో చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నాడన్నది తాజా వార్త. ఆ హీరోయిన్ ఎవరో కాదు. శోభిత… ధూలిపాళ. ఇటీవల మేజర్ చిత్రంతో మెరిసింది శోభిత. గూఢచారిలోనూ కథానాయికగా నటించింది. గత కొంత కాలంగా చైతూ – శోభిత ఇద్దరూ టచ్లో ఉన్నారని, ఇద్దరూ కలిసే ఉంటున్నారని, ఇటీవల జరిగిన శోభిత పుట్టిన రోజు వేడుకలకు హాజరైన అతికొద్దిమంది సన్నిహితులత్లో చైతూ ఒకడని ఇన్ సైడ్ వర్గాల టాక్.
ఓ బంధానికి బీటలు వారాక… మళ్లీ వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త అనుబంధాలు పెంచుకోవడానికీ చాలా సమయం పడుతుంది. కానీ చైతూ ఈ విషయంలో అంత సమయం తీసుకోవడం ఇష్టంలేనట్టే ఉంది. అందుకే… తన జోడీని వెదుక్కొని ఉండొచ్చు. సమంతతో పెళ్లి, ప్రేమ వ్యవహారంలోనూ ఇంతే. ముందే మీడియాలో రకరకాల వార్తలొచ్చాయి. వాటిపై చైతూ ఎప్పుడూ స్పందించలేదు. సరైన సమయంలో, సరైన వేదికపై తన మనసులోని మాట చెప్పాడు. విడాకుల విషయంలో రూమర్లకు సైతం తొందరపడలేదు. క్లియర్ కట్ గా చెప్పాల్సిన సమయంలోనే సమాధానం చెప్పేశాడు. శోభిత విషయంలోనూ ఇదే చేయబోతున్నాడా? సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడా? అనే ఆసక్తి నెలకొంది. ఈరోజు సోషల్ మీడియా పెరిగింది. బయట ఎవరేం చేసినా ఇట్టే తెలిసిపోతుంది. ఈ విషయాలు చైతూకి తెలుసు. అయినా సరే, అందరికీ తెలిసేలానే బాహాటంగానే శోభితతో సన్నిహితంగా ఉంటున్నాడంటే… `ఇది తెలిసినా పెద్ద ప్రమాదం ఏమీ లేదు` అనుకొని ఉండొచ్చు. మరి ఈ వార్తలన్నీ కలిసి గందరగోళం సృష్టించక మునుపే చైతూ అసలు విషయం బయట పెడతాడేమో చూడాలి.