లవ్ స్టోరీలకు అతికినట్టు సరిపోతాడు నాగచైతన్య. తన హిట్స్‌లో ప్రేమకథల వాటానే ఎక్కువ. ఈసారి లవ్ స్టోరీలను తీయడంలో ఆరితేరిపోయిన శేఖర్ కమ్ములతో జట్టుకట్టారు. వీళ్లకు సాయి పల్లవి తోడైంది. అందుకే `లవ్ స్టోరీ`పై అన్ని అంచనాలు ఏర్పడ్డాయి. సెకండ్ వేవ్ తరవాత థియేటర్లు తెరచుకున్నా ఇప్పటి వరకూ సరైన ఊపు రాలేదు. `లవ్ స్టోరీ`తో మళ్లీ టాలీవుడ్ కి రెక్కలొస్తాయని సినిమావాళ్లు నమ్ముతున్నారు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా లవ్ స్టోరీ గురించి చైతూ మాటల్లో….
లవ్ స్టోరీ ఇంకొన్ని గంటల్లో తెరపైకొచ్చేస్తుంది. టెన్షన్ గా ఫీలవుతున్నారా, లేదంటే నమ్మకంతో ఉన్నారా?
సినిమా కథపై నాకు చాలా నమ్మకం. థియేటర్ రెస్పాన్స్ గురించి ఆలోచిస్తే టెన్షన్ గా ఉంది. మూడు రోజుల అడ్వాన్స్ బుకింగ్ లెక్కలు సంతృప్తినిస్తున్నాయి. సోమవారం నుంచి ఎలా ఉంటుందో చూడాలి.
కరోనా భయాల మధ్య కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే అనుకుంటున్నారా?
– బయట జనాలు రోడ్లపై బాగానే తిరుగుతున్నారు. థియేటర్లలో మాత్రం కనిపించలేదు. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇస్తే వాళ్లంతా తప్పకుండా థియేటర్లకు వస్తారని నా నమ్మకం. ఫస్ట్ వేవ్ తరవాత అదే ట్రెండ్ కనిపించింది.
ఈ సినిమా కోసం రెండు క్లైమాక్స్‌లు తీశారని ప్రచారం జరుగుతోంది. నిజమేనా?
– అదేం కాదండీ. ఒకే ఒక క్లైమాక్స్ తీశాం. కాకపోతే.. షూట్ అయిపోయిన తరవాత మాకు చాలా సమయం దొరికింది. ఎడిట్ లో చూసీ చూసీ.. బెటర్ చేయాలన్న నిర్ణయం తీసుకున్నాం. అదే కంటెంట్ ని బెటర్ గా మళ్లీ తీశాం.
ఇప్పటి వరకూ చాలా ప్రేమకథలు వచ్చాయి. వాటితో పోలిస్తే లవ్ స్టోరీ లో కొత్తగా ఏం చూపించబోతున్నారు?
శేఖర్ కమ్ముల ఈ సినిమాలో రెండు సెన్సిటీవ్ లేయరన్స్ టచ్ చేశారు. కాస్ట్. జెండర్. ఇవి రెండూ కొత్తగా ఉంటాయి. ఇలాంటి విషయాలు మాట్లాడాలంటే భయపడతారు. ఈ విషయాలపై ఏమైనా ఆర్టికల్స్ చదివేటప్పుడు ఇబ్బందిగా అనిపించేది. మనం ఎందుకు ఇలాంటి విషయాలు మాట్లాడం? అనిపిచింది. ఈ స్క్రిప్టు చదివినప్పుడు ఆ లేయన్స్ కనిపించాయి. ఇది చాలా రియలిస్టిక్ లవ్ స్టోరీ. సినిమాటిక్ రిబర్టీ తీసుకోలేదు. ఓ పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన అబ్బాయికి సిటీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది.
ఈ సినిమా రిజల్ట్ కోసం పరిశ్రమ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది..
– అవును. రెండేళ్ల నుంచీ చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇండ్రస్ట్రీ మళ్లీ రీఛార్జ్ అవ్వాలి. అందుకోసమైనా.. సినిమా బాగా ఆడాలి.
శేఖర్ కమ్మలలో మీకు ప్రత్యేకంగా కనిపించిన లక్షణాలేంటి?
– ఆయన చూపించే డెడికేషన్, నిజాయితీ చాలా తక్కువ మందిలో చూస్తాం. ప్రతీ మేకర్ కీ ఓ స్టైల్ ఉంటుంది. శేఖర్ గారు నెక్ట్స్ లెవల్. ఆయన సినిమాల్లో నటించడం ప్రతీ నటుడికీ ఓ ఛాలెంజ్. నాకైతే… లవ్ స్టోరీ ఓ కొత్త మజిలీ. ఆయన డిటైలింగ్ చాలా బాగుంటుంది. ప్రతీ విషయాన్నీ క్షుణ్ణంగా ఆలోచిస్తారు. ఆయన టచ్ చేసే టాపిక్స్ కూడా.. సెన్సిటీవ్ గా ఉంటాయి.
ఆయన సినిమాల్లో హీరోయిన్ పాత్రలు డామినేట్ చేస్తుంటాయి. ఈసారీ అంతేనా?
– ఏ పాత్రకి ఎంత అవసరమో అంతే ఉంటుంది. పల్లవి పాత్ర చాలా ముఖ్యమైంది. ఆ పాత్ర ద్వారా ఓ సోషల్ ఇష్యూ చెప్పారు. అది చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
తెలంగాణ యాసలో డైలాగులు చెప్పడం ఇదే మొదటిసారి. దానిపై ఎలాంటి కసరత్తు చేశారు?
– షూటింగ్ స్టార్స్ అయ్యే రెండు నెలలు ముందే డైలాగ్స్ పై కూర్చున్నాం. ఈలోగా శేఖర్ గారు చాలా ఆర్టికల్స్ పంపారు. యూ ట్యూబ్ లో కొన్ని వీడియోలు చూశా. షూటింగ్ ఎక్కువగా నిజామాబాద్ లో చేశాం. వాళ్ల లైఫ్ ఎలా ఉంటుంది? ఆ వాతావరణం ఎలా ఉంటుంది? అనేది తెలుసుకున్నా. డబ్బింగ్ కి చాలా టైమ్ పట్టింది. ఏ సినిమాకైనా డబ్బింగ్ కి పెద్దగా టైమ్ ఉండదు. ఈ సినిమా మాత్రం అలా కాదు. సినిమా పూర్తయిన తరవాత నా చేతుల్లో 8 నెలల సమయం ఉంది. అందుకే.. నిదానంగా డబ్బింగ్ చెప్పా.
డాన్స్ విషయంలోనూ కష్టపడినట్టున్నారు?
– నాకెందుకో ముందు నుంచీ డాన్సులంటే భయం. కంఫర్ట్ గా ఉండలేను. కానీ నా భయాన్ని శేఖర్ కమ్ముల పోగొట్టారు. నా బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో ఉంచుకుని స్టెప్పులు డిజైన్ చేశారు. ప్రతీ స్టెప్పుకీ ఎన్ని టేకులు తీసుకున్నానో నాకు మాత్రమే తెలుసు. అలాంటప్పుడు సాయి పల్లవి చాలా ఓపిగ్గా భరించింది.
లైవ్ లొకేషన్స్‌లో షూటింగ్ చేశారు. అదేమైనా ప్లస్ అయ్యిందా?
– లైవ్ లొకేషన్స్ లో సినిమా తీయడం శేఖర్ గారికి చాలా ఇష్టం. యాక్టర్స్‌కి కూడా తెలియని ఓ ఉత్సాహం వస్తుంది. అది కచ్చితంగా సినిమాకి ప్లస్ అవుతుంది. కొన్ని సినిమాలకు లైవ్ లొకేషన్లలో చేయడం చాలా కష్టం. లవ్ స్టోరీ లాంటి సినిమాలకు మాత్రం చేయాలి.
హీరోలంతా పాన్ ఇండియా మంత్రం జపిస్తున్నారు. మీరెప్పుడు అటు వైపు అడుగులు వేస్తారు?
– పాన్ ఇండియా మార్కెట్ గురించి నాకు తెలీదు. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు చేయాలనుకుంటా. సంస్కృతి పరంగా మన తెలుగు సినిమాలు స్ట్రాంగ్ గా ఉండాలి. పాన్ ఇండియా కోసం కథలు రాస్తే.. మన నేటివిటీకి దూరమవుతాం. నా ఫోకస్ అంతా తెలుగు ప్రేక్షకులపైనే.
ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అమీర్ ఖాన్ మిమ్మల్ని తెగ పొగిడేశారు. అంతగా ఆయన దృష్టిలో పడ్డారంటే ఏదో మ్యాజిక్ చేసుండాలే…
– నేను నాలా ఉన్నానంతే. ఆయనకు అదే నచ్చింది. నాకైతే అమీర్ తో పనిచేయడం ఓ మర్చిపోలేని అనుభవం. ఈ 12 ఏళ్లలో ఏం నేర్చుకున్నానో అంతకంటే ఎక్కువగా ఆ 40 రోజుల్లో నేర్చుకున్నా.
ఓటీటీ ప్రభావం వల్ల… కథానాయకుల ఆలోచనల్లో మార్పులొస్తాయా?
– ఓటీటీ వల్ల ఎక్స్పోజ్ బాగా పెరిగింది. స్టార్ హీరోలు తప్పితే… మిగిలినవాళ్లు కమర్షియల్ ఫార్మెట్లో సినిమాలు చేస్తే.. అంగీకరించడం లేదు. కొత్త కంటెంట్ తో ఆడియన్స్ మెప్పించడం చాలా కష్టమైన విద్య. యంగ్ హీరోలే ఆ బాధ్యత తీసుకోవాలి. నాకైతే యాక్షన్ సినిమాలూ చేయాలనీ ఉంటుంది. కొన్ని సినిమాల్లో ట్రై చేశాను కూడా. కానీ నా బాడీ లాంగ్వేజ్‌కి అలాంటి కథలు సెట్ అవ్వవని అర్థమైంది. లవ్ స్టోరీల్లో కనిపించడం చాలా కంఫర్ట్ గా ఫీలవుతా.
బంగార్రాజు గురించి…
– సోగ్గాడే చిన్ని నాయిన సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఫ్రాంజైజ్‌ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. బంగార్రాజులో పాత్రలు అవే ఉంటాయి.. కానీ కథ చాలా ఫ్రెష్ గా ఉంటుంది.
కొంతమంది నిర్మాతలు థియేటర్ల గురించి ఎదురు చూడకుండా ఓటీటీలకు సినిమాలు ఇచ్చేస్తున్నారు. దీని వల్ల పరిశ్రమకు ఇబ్బంది కదా?
– కొంతమంది థియేటర్ల గురించి ఎదురు చూస్తూ సినిమాల్ని హోల్డ్ చేయగలుగుతున్నారు. కొంతమంది హోల్డ్ చేయలేకపోతున్నారు,. ఈ రెండేళ్లలో పరిస్థితులు చాలా మారాయి. ఆ టైమ్ కి ఏది కరెక్టో అది చేస్తున్నారు. అలాగని వాళ్లని జడ్జ్ చేయకూడదు. ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయడం హ్యాపీ. ఓటీటీకి ఇచ్చినవాళ్లని తప్పు పట్టలేను. ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఏం చేయలేం.