నాగార్జున వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టాడు నాగచైతన్య. అయితే నాన్నలా ప్రయోగాలు చేయడానికి మాత్రం కాస్త భయపడ్డాడు. ఎక్కువగా కమర్షియల్ సినిమాలనే ఎంచుకున్నాడు. తొలిసారి సవ్యసాచి కోసం ఓ ప్రయోగాత్మక కథ ఎంచుకున్నాడు. అయితే… ఇందులో కమర్షియల్ వాల్యూస్ బాగానే దట్టించినట్టు చెబుతున్నాడు చై. రేపు (శుక్రవారం) ఈ చిత్రం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా చైతో చేసిన చిట్ చాట్ ఇది.
ఈ రోజు విడుదల చేసిన అర్జునుడు గెటప్‌లో కొత్తగా కనిపిస్తున్నారు..
థ్యాంక్సండీ..
పూర్తి స్థాయి పౌరాణిక పాత్రలు వస్తే చేస్తారా?
చూడాలి. అన్నింటికంటే ముందు ఓ రెండు మూడు మంచి విజయాలు అందుకోవాలి. అప్పుడు ఎన్ని ప్రయోగాలు చేసినా ఫర్వాలేదు. `సవ్యసాచి`లో ఓ కామెడీ ఎపిసోడ్ ఉంది. హాస్యనటులంతా కలసి చేసిన ఫన్నీ స్కిట్ అది. చాలా బాగుంటుంది. అందుకోసమే నేను అర్జునుడిలా మారాను.
ప్రయోగాలకు చాలా టైమ్ ఉంది అంటున్నారు.. మరి `సవ్యసాచి` కూడా ప్రయోగమే అనుకోవాలి కదా?
చందూ మొండేటి ముందు కథ వినిపించినప్పుడు ఇది ప్రయోగాత్మక సినిమానే అనిపించింది. అయితే… చిన్న సినిమాగా తీయడం మాకు ఇష్టం లేదు. దానికి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించమని అడిగాను. అవన్నీ పేర్చుకుంటూ… పూర్తి స్థాయి కథ చెప్పాడు. అప్పుడే ఇది కమర్షియల్గానూ వర్కవుట్ అవుతుందనిపించింది.
రీమిక్స్ పాట, కామెడీ బిట్లు, హీరోయిన్‌తో లవ్ ట్రాక్.. ఇవన్నీ కమర్షియల్ జోడింపులు అనుకోవచ్చా?
కమర్షియల్ అంశాల్ని చందూ మొండేటి తెలివిగా కథలో మిక్స్ చేశాడు. కాబట్టి.. అవన్నీ కథలో భాగంగానే వస్తాయి. ఇక్కడ అనవసరంగా ఈ పాట వచ్చింది అన్న ఫీలింగ్ ఎవ్వరికీ రాదు.
నాన్నగారి పాట రీమిక్స్ చేశారు.. భయం అనిపించలేదా?
ముందు చాలా భయపడ్డా. అనవసరంగా ఈ పాటని పాడు చేస్తున్నామేమో అనిపించింది. అభిమానులు కూడా ఎక్కవ
ఆశించి వస్తారు అన్న భయం వేసింది. అయితే.. తెరపై చూసుకున్న తరవాత హ్యాపీగా అనిపించింది. ఈ పాట కచ్చితంగా అందరికీ నచ్చుతుంది.
ఈమధ్య డాన్సులు కూడా బాగా చేస్తున్నారు.. ఆ విభాగంలోనూ రాణించాలన్న తాపత్రయమా?
నిజంగానే డాన్సులపై ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. నాకంతగా రావు కూడా. శేఖర్ మాస్టర్ వల్ల గత రెండు సినిమాల్లోనూ డాన్సులు చేసే అవకాశం వచ్చింది.
శైలజా రెడ్డి అల్లుడు ఫలితం నిరాశ పరిచిందా?
ఆ సినిమాకి ప్రారంభ వసూళ్లు చాలా బాగా వచ్చాయి. నా కెరీర్లో అదే గొప్ప ఓపెనింగ్స్. కానీ… దాన్ని నిలబెట్టుకోలేదని, అందరికీ రీచ్ కాలేకపోయాయని బాధ పడ్డా.
తప్పు ఎక్కడ జరిగింది?
అది మనకు తెలీదు. ఏ సినిమా హిట్టవుతుందో, ఏది ఫ్లాప్ అవుతుందో ఎవరు చెప్పగలరు. మారుతిగారు కథ చెప్పినప్పుడు కన్వెన్సింగ్గానే అనిపించింది.
ఒకే రోజు `యూ టర్న్`, `శైలజా రెడ్డి అల్లుడు` విడుదలయ్యాయి.. ఇంతకీ ఎవరు గెలిచినట్టు?
అది మీరే చెప్పాలి. నా వరకైతే.. రివ్యూల పరంగా సమంత, వసూళ్ల పరంగా నేను గెలిచాం. మొత్తానికి నేనూ, సమంత ఇద్దరూ గెలిచినట్టే.
సమంతతో ఓ సినిమా చేస్తున్నారుగా.. సెట్లో ఎలా వుంది?
చాలా బాగుంది. ఈ సినిమాలో కూడా మేం భార్యా భర్తలుగానే నటిస్తున్నాం. కానీ కథ ప్రకారం మేం గొడవలు పడాలి. నిజ జీవితంలో ఎప్పుడూ గొడవ పడలేదు కదా. అందుకే కొత్తగా అనిపిస్తోంది.
పెళ్లయ్యాక మీలో వచ్చిన మార్పులేంటి?
ఇదివరకటికంటే హ్యాపీగా, కాన్ఫిడెన్ట్‌గా ఉన్నా, ఏదైనా చేయగలనన్న ధైర్యం వచ్చింది. జీవితానికి పరిపూర్ణత లభించింది.
చందూ మొండేటి చాణిక్య అనే మరో కథ చెప్పాడట.. అది కూడా చేస్తారా?
చందూతో ఇది రెండో సినిమా. తప్పకుండా తనతో సినిమాలు చేస్తా. `ప్రేమమ్` తరవాత మళ్లీ తను నాతోనే సినిమా చేస్తాడని నేను అనుకోలేదు. అలాంటిది `మనం ఈ సినిమా చేద్దాం` అని సవ్యసాచి కథ వినిపించాడు. తనని ఎప్పటికీ మర్చిపోలేను.
ఈ సినిమా విషయంలో మీ నాన్నగారి జోక్యం ఎంత?
అన్ని సినిమాలకూ ఆయన సలహాలు ఇస్తారు. ఈ సినిమా చూసి కొన్ని మార్పులు చెప్పారు.
రీషూట్ల పరంపర మీరూ కొనసాగిస్తున్నారు.. కారణమేంటి?
రీషూట్లేం తప్పు కాదు. దాదాపు ప్రతీ సినిమాకీ ఇది జరిగే తంతే. సినిమా ఇంకాస్త బెటర్‌గా రావడానికి మేం పడే తాపత్రయమే ఇదంతా. సినిమా విడుదలయ్యాక. `అరె.. ఇలా చేస్తే బాగుండేదే` అని బాధపడేకంటే.. ముందే రిపేర్లు చేసుకోవడం తప్పు కాదు.
తదుపరి సినిమా ఏమిటి?
వెంకీ మామ డిసెంబరులో మొదలవుతుంది. ఇంకొన్ని కథలు వింటున్నా.