2020లో బంగార్రాజుతో హిట్టు కొట్టాడు నాగచైతన్య. ఆ తరవాత వరుస పరాజయాలు పలకరించాయి. ‘ధ్యాంక్యూ’, ‘కస్టడీ’, ‘లాల్ సింగ్ చద్దా’ ఇలా హ్యాట్రిక్ ఫ్లాపులు చుట్టుముట్టాయి. ఈ దశలో చైతూ నుంచి వచ్చిన సినిమా ‘తండేల్’. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. తొలి రోజు మంచి వసూళ్లు రాబట్టుకొంది. చైతూ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్. ఈ వసూళ్లు ఎంత నిలకడగా ఉంటాయి? ఎబౌ యావరేజ్ టాక్ తెచ్చుకొన్న ‘తండేల్’ హిట్ గా టర్న్ తీసుకొంటుందా? అనేది రెండు మూడు రోజులు ఆగితే తెలుస్తుంది. కాకపోతే ఇలాంటి బజ్, ఇంతటి ఓపెనింగ్ ఈమధ్య కాలంలో నాగచైతన్య చూడలేదు. పైగా ఈ సినిమా కోసం నాగచైతన్య చాలా కష్టపడ్డాడు. ఎంతో నమ్మకం పెట్టుకొన్నాడు. తన నమ్మకం ఈ సినిమా నిలబెట్టినట్టే.
‘తండేల్’ ఇంత బజ్ తెచ్చుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. సాయి పల్లవి హీరోయిన్ కావడం, దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలు శ్రోతలకు చేరువ కావడం, ఇదో నిజ జీవిత ఘటన కావడం.. ఇవన్నీ `తండేల్`పై ఫోకస్ పెంచాయి. దర్శకత్వ పరంగా, రచన పరంగా ఈ సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటికి మెరుగు పరచుకొని ఉండుంటే.. `తండేల్` ఇంకా మంచి స్థాయిలో ఉండేది. ఈమధ్య యావరేజ్ స్థాయి సినిమాలు కూడా అనూహ్యమైన విజయాలు అందుకొంటున్నాయి. ప్రేక్షకుల పల్స్‌ని పట్టుకోలేకపోతోంది బాక్సాఫీస్. ‘తండేల్’కు బాక్సాఫీసు దగ్గర పోటీ లేదు. పైగా ఫ్యామిలీకి నచ్చే అంశాలున్నాయి. సాయి పల్లవి కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలదు. కాబట్టి… వసూళ్ల విషయంలో ఈ సినిమాకు ఢోకా ఉండకపోవొచ్చు.