నాగచైతన్య ‘తండేల్తో’ ఓ సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు అదే ఉత్సాహంతో కార్తీక్ దండు దర్శకత్వంలో సినిమాని మొదలు పెట్టేశాడు. సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తున్న సినిమా ఇది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. విరూపాక్ష తరవాత కార్తీక్ దండు నుంచి వస్తున్న సినిమా ఇది. కాబట్టి అంచనాలు భారీగానే ఉంటాయి. ఇదో మిథికల్ థ్రిల్లర్. ఈ చిత్రానికి ‘వృష కర్మ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇదో సంస్క్రృత పదం. సంస్కృతంలో ”వృషకర్మణే నమః” అనే ఓ స్లోకం ఉంది. అంటే.. ధర్మాన్ని నిర్వర్తించే నాయకుడికి నమస్కారం అని అర్థం. దీన్ని బట్టి.. ఈ సినిమాలో హీరో పాత్ర ఎలా ఉండబోతోందన్నది అర్థం అవుతుంది.
అయితే ‘వృష కర్మ’ అనేది పూర్తిగా కొత్త పదం. అంత తేలిగ్గా అర్థం అవుతుందా? అనే అనుమానాలు ఉన్నాయి. కాకపోతే.. ‘విరూపాక్ష’ అన్నా కూడా మనకు పెద్దగా తెలీదు. కానీ సినిమా నచ్చింది. చూశాం. ఆ పదానికి అర్థాన్ని తెలుసుకొన్నాం. ఇప్పుడు ‘వృష కర్మ’ విషయంలోనూ ఇదే జరుగుతుందని చిత్రబృందం గట్టిగా నమ్ముతోంది. ఈసాయింత్రం ఈ సినిమా నుంచి ఓ కీలకమైన అప్ డేట్ రాబోతోందని చిత్రబృందం ప్రకటించింది. బహుశా.. టైటిల్ ఏమైనా రివీల్ చేస్తారేమో చూడాలి.