వెంకట్ ప్రభు సినిమాల్లో ‘మానాడు’కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. టైమ్ లూప్ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో ‘మా నాడు’ ది బెస్ట్. చాలా కాలం తరవాత శింబు కి ఓ మంచి విజయాన్ని అందించిన సినిమా ఇది. సూర్యకి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తారని వార్తలొచ్చాయి. నాగ చైతన్య, వెంకట్ ప్రభు కలిసి ఓ సినిమా చేస్తున్నారన్న సంగతి బయటకు పొక్కగానే అది.. ‘మానాడు’ రీమేక్ అనుకొన్నారు. అయితే.. ‘కస్టడీ’లాంటి వేరే కథని ఎంచుకొని అందరినీ సర్ప్రైజ్ చేశారు వీరిద్దరూ. `మానాడు ` రీమేక్‌తోనే వెంకట్ ప్రభు నాగచైతన్యని కలిశాడని, అయితే రీమేక్ సినిమాలు చేయడం ఇష్టం లేక.. నాగచైతన్య ‘మానాడు’ని పక్కన పెట్టాడని మాట్లాడుకొన్నారు. వీటిపై నాగ చైతన్య స్పందించాడు.
”మానాడు రీమేక్ చేయాలన్న ఆలోచన మా ఇద్దరికీ లేదు. ‘మానాడు’ రిలీజ్‌కి ఆరు నెలల ముందే వెంకట్ నన్ను కలిశాడు. ఈ కథ చెప్పాడు. వెంటనే ఓకే చేశా. ‘మానాడు’ లాంటి కథలు మళ్లీ మళ్లీ రావు. రీమేక్ చేసి ఆ మ్యాజిక్‌ని మళ్లీ సృష్టించలేం” అని క్లారిటీ ఇచ్చేశాడు నాగచైతన్య. `కస్టడీ` సినిమాపై మాత్రం చైతూ వీర కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడు. ”ఈ సినిమాని శివతో చాలామంది పోలుస్తున్నారు. నాకు వ్యక్తిగతంగా పోలికలు ఇష్టం ఉండవు. ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. నా సినిమాల్లో ‘కస్టడీ’ ది బెస్ట్ గా నిలుస్తుంది” అని ధీమా వ్యక్తం చేశాడు. కస్టడీ హిట్టయితే.. వెంటనే కస్టడీ 2 కూడా పట్టాలెక్కిస్తామని ప్రామిస్ చేశాడు చైతూ.