అక్కినేని ఇంట్లో ఇప్పటికే రెండు నిర్మాణ సంస్థలున్నాయి. అన్నపూర్ణ స్డూడియోస్, మనం ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు రెండూ వాళ్లవే. సోలోగా సినిమాలు తీయాలనుకుంటే అన్నపూర్ణ స్డూడియోస్లో తీస్తారు. అదే భాగస్వామ్యం ఇవ్వాలంటే మనం ఎంటర్టైన్మెంట్స్ ఉంది. ఇప్పుడు మూడో సంస్థ కూడా రాబోతోంది. నాగచైతన్య, సమంతలు కలసి ఓ నిర్మాణ సంస్థని స్థాపించాలన్న ఆలోచనలో ఉన్నారు. అందుకు తగిన ఏర్పాట్లూ జరుగుతున్నాయి. చైతూకి ఎప్పటి నుంచో ప్రొడక్షన్ చేయాలనివుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సినిమాల నిర్మాణ వ్యవహారాల్ని తను కూడా చూసుకుంటుంటాడు. `మన్మథుడు 2`కి సంబంధించిన ప్రొడక్షన్ కూడా సమంత, చైతూ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు వీరిద్దరూ కలసి ప్రొడక్షన్ హౌస్ స్థాపించాలని చూస్తున్నారు. తమకు నచ్చిన కథలు వచ్చినప్పుడు, తమ బ్యానర్లోనే తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆ కథల్లో తాము నటించినా, నటించకపోయినా కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలన్నది చై, సమంతల ఉద్దేశం. మరి ఈ ప్రొడక్షన్ ఏ సినిమాతో మొదలెడతారో చూడాలి.