శైలజా రెడ్డి అల్లుడు సినిమా విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాడు నాగచైతన్య. తన బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉండబోతోందని, ఫ్యాన్స్‌ని అలరించే సినిమా ఇదని…. ఊరిస్తున్నాడు. `శైలజా రెడ్డి అల్లుడు` ప్రీ రిలీజ్ ఫంక్షన్ కాసేపటి క్రితం హైదరాబాద్‌లో ముగిసింది. చైతూ మాటల్లో హిట్టు కొట్టబోతున్నామన్న ధీమా కనిపించింది. `ఫ్యాన్స్ నా నుంచి ఆశించేది హిట్టు సినిమానే. ఇక నుంచి మిమ్మల్ని దృష్టిలో ఉంచుకునే సినిమాలు తీస్తా. మనకు కావల్సిన సినిమా మారుతిగారు ఇచ్చేశారు. నా బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటుంది. నన్ను బాగా చూపించారు. ఫ్యాన్స్ కామెంట్లని నా కంటే మారుతి గారే ఎక్కువ పట్టించుకుంటారు. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ఈ సినిమా తయారు చేశారు. రమ్యకృష్ణ ఈ సినిమాకి మూలస్థంభం. ఆమెని దృష్టిలో ఉంచుకునే మారుతి ఈ కథ చెప్పారు. ఆమె లేకపోతే ఈ సినిమా లేదు. పండక్కి ఈ సినిమాని విడుదల చేస్తున్నాం. పండగలా ఉంటుంది. మీ కళ్లలో ఆనందం చూసి నేను కూడా పండగ చేసుకుంటా“ అన్నాడు చైతూ. అను ఇమ్మానియేల్ కథానాయికగా నటించిన ఈ చిత్రం ఈనెల 13న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.