చిన్న సినిమాలకు ఒకలా, పెద్ద సినిమాలకు మరోలా పని చేయడం దేవిశ్రీ ప్రసాద్‌కి చేతకాదు. ఏ సినిమాకైనా తన 100 శాతం ఎఫెక్ట్ పెడతాడు. చిన్న సినిమాలకు, మీడియం రేంజ్ సినిమాలకు ఇంకాస్త ఎక్కువ ప్రేమతో పని చేస్తుంటాడు. ‘ఉప్పెన’ లాంటి సినిమాకు దేవి ఎంత హెల్ప్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాటలతోనే ఆ సినిమా ప్రేక్షకులకు చేరువైంది. సినిమా చూడాలన్న ఉత్సాహాన్ని కలిగించింది. దేవి కెరీర్లో మంచి ఆల్బమ్స్‌లో అదొకటి. ఆ తరవాత పుష్ప మినహాయిస్తే.. ఆ స్థాయిలో దేవి మ్యూజిక్ ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు ‘తండేల్’ ఆల్బమ్ చూస్తుంటే – దేవి మళ్లీ నూటికి రెండొందల శాతం కష్టపడి పాటలు కంపోజ్ చేశాడనిపిస్తోంది. ఉప్పెనలా తండేల్ చిన్న సినిమా కాదు. కాకపోతే… దేవికి పని చేసే స్కోప్ మాత్రం ఈ సినిమా ఇచ్చిందనిపిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ 3 పాటలొచ్చాయి. బుజ్జితల్లి, హెలెస్సా.. ఈ రెండు పాటలూ ఇన్ స్టెంట్ గా హిట్టయిపోయాయి. ఆర్కెస్ట్రా పరంగా, వోకల్స్ పరంగా ఫ్రెష్‌గా ఉన్న గీతాలివి. శివుడి పాట కూడా బాగుంది. కాకపోతే.. బుజ్జితల్లి, హెలెస్సాలా వినగానే ఎక్కేసే పాట కాదు. ఈ సినిమాలో రాబోతున్న మిగిలిన పాటలు సైతం.. చాలా బాగా వచ్చాయని, ఈ సినిమాకు సగం బలం దేవిశ్రీ ప్రసాద్ పాటలే అని చిత్రబృందం ధీమాగా చెబుతోంది.
ఫిబ్రవరి 7న ఈ సినిమా వస్తోంది. ఇప్పటి నుంచే ప్రమోషన్లు మొదలెట్టేశారు. మరో రెండు పాటలు, ట్రైలర్ రావాల్సివుంది. సాయిపల్లవికి ఉన్న క్లీన్ ఇమేజ్, తనపై ఉన్న అంచనాలు ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. ‘లవ్ స్టోరీ’లో చైతూ – సాయిపల్లవి జంటగా నటించారు. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. దానికంటే.. ఈ సినిమాలో ఈ జంట మరింత చూడ ముచ్చటగా ఉండబోతోందని విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. ఈ సినిమా కథలో ప్రేమ, దేశభక్తి రెండింటినీ మేళవించారు. ఆ లెక్కన బాక్సాఫీసు దగ్గర ఓ వారం ముందే ప్రేమికుల రోజు మొదలవబోతోందన్నమాట.