నాగచైతన్య – సమంత.. ఇద్దరూ ఒక్కటే ఇప్పుడు. వాళ్ల మధ్య ఈగోల గోల ఉండదు. కానీ.. వాళ్ల దగ్గర పనిచేసే స్టాఫ్‌కి ఉండే అవకాశాలున్నాయి కదా? ఇప్పుడు అదే జరిగింది. సమంత కోసం పనిచేసేవాళ్లకు సమంత గొప్ప. చైతూ స్టాఫ్‌కి చైతూనే గొప్ప. వాళ్ల మధ్య ఈగో క్లాష్ సమంత, చైతూలకు తలనొప్పి తెచ్చేలా మారింది.
వివరాల్లోకి వెళ్తే… సమంతకు, నాగచైతన్యకు ప్రత్యేకంగా స్టాఫ్ ఉన్నారు. డ్రస్సింగ్, హెయిర్ స్టైలింగ్, మేకప్ ఇలా.. ఒకొక్క పనికీ వేర్వేరుగా కొంతమందిని నియమించుకున్నారు. ప్రతీ హీరోకీ ఇలా వ్యక్తిగత సిబ్బంది ఉండడం మామూలే. సమంత తన స్టాఫ్‌ని చాలా బాగా చూసుకుంటుంది. ఎంతలా అంటే… వాళ్ల పుట్టిన రోజుకు ఖరీదైన బహుమానాలు ఇవ్వడం, సినిమా హిట్టయితే పార్టీలు, నజరానాలు ప్రకటించడం లాంటివి చేస్తుంటుంది. దాంతో.. సమంత అంటే వాళ్లంతా బాగా ఎటాచ్మెంట్ పెంచేసుకున్నారు.
ఈమధ్య మజిలీ సినిమా విడుదలైంది. బాగా ఆడింది కూడా. ఈ సినిమాలో సమంత బాగా చేసిందా? నాగ చైతన్య బాగా చేశాడా? అనే టాపిక్ సమంత, చైతూ స్టాఫ్ మధ్య నడిచిందట. ఈ విషయంలో రెండు గ్రూపుల మధ్య వాదోపవాదాలు బాగా నడిచాయి. ఈ విషయం చైతూకీ తెలిసిపోయింది. ఓ సందర్భంలో `నేను బాగా చేశానా? సమంత బాగా చేసిందా?` అని డైరెక్టుగా సమంత స్టాఫ్‌నే చైతూ అడిగాడని సమాచారం. సమంత స్టాఫ్ కదా? అందుకే వాళ్లంతా ‘సమంత మేడమే బాగా చేసింది’ అనేసరికి.. చైతూ హర్టయ్యాడని తెలిసింది. ఒకర్నయితే.. ‘నువ్విక పనిలోకి రాకు’ అని డైరెక్టుగా చెప్పేశాడట. దాంతో సమంత రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టిందట. భార్యాభర్తలుగా మారిన హీరో, హీరోయిన్లు కలసి కట్టుగా సినిమా చేస్తే.. ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి మరి.