నాగచైతన్య కెరీర్లో లవ్ స్టోరీలదే హవా. తను అలాంటి పాత్రల్లో చక్కగా ఒదిగిపోతాడు కూడా. తన తొలి హిట్టు ఏం మాయ చేశావేతో దక్కింది. 100 % లవ్ యూత్‌కి బాగా నచ్చేసింది. మనంలో కూడా చైతూది ఓ సెపరైట్ లవ్ ట్రాక్. ఇప్పుడు ప్రేమమ్‌తో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. మాస్ మసాలా అంశాల జోలికి పోకుండా.. ఓ క్లీన్ లవ్ స్టోరీ చెప్పాలనుకొన్నప్పుడు చైతూ సక్సెస్ అయ్యాడు. దాన్ని వదిలి ఎప్పుడైతే అందరి హీరోల్లా మాస్, యాక్షన్ బాట పట్టాడో అప్పుడు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే చైతూ దృష్టి ఇప్పటికీ.. ఆ కమర్షియల్ అంశాలపైనే ఉండడం విస్మయ పరుస్తోంది. ‘నాకు లవ్ స్టోరీలకంటే యాక్షన్ సినిమాలంటేనే ఇష్టం. త్వరలో ఆ తరహా సినిమాలూ చేస్తా’ అంటున్నాడు చైతూ. అంతేకాదు.. ఈమధ్య తనని కలసిన ఇద్దరు దర్శకులకు మాస్ కథలుంటే చెప్పండి అన్నాడట. దీన్ని బట్టి చైతూ ఎలాగైనా తనని తాను ఓ మాస్ హీరోగా నిరూపించుకోవాలన్న ప్రయత్నం మానడం లేదని అర్థమవుతూనే ఉంది.
దడ, ఆటోనగర్ సూర్యల్లో చైతూ ట్రై చేసింది అదే. ఆ సినిమాలు రెండూ డిజాస్టర్లు అయ్యాయి. అయినా ఆ మత్తులోంచి బయటపడడం లేదు ఈ అక్కినేని హీరో. ఏఎన్నార్ మాస్ హీరోనే. నాగార్జున అయితే పక్కా మాస్. అయితే వాళ్లిద్దరూ ఫైటింగులు, ఎగస్ట్రా ఫిట్టింగుల జోలికి వెళ్లలేదు. వాళ్ల సినిమాలో అవి ఉన్నా… పైపై మెరుగులు మాత్రమే. అక్కినేని, నాగ్ ఇద్దరూ వాళ్ల పరిమితులకు లోబడి, అవేంటో తెలుసుకొనే సినిమాలు చేశారు. స్వీయ లోపంలు లెరుగుట పెద్ద విద్య… అనేది అక్కినేని జీవితాంతం నమ్మిన క్యాప్షన్. అయితే… చైతూ మాత్రం ఆ సంగతి మర్చిపోతున్నాడు. చైతూ వయసు, తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ లవ్ స్టోరీలకు సూటైపోతాయి. కొడితే పదిమంది ఎగిరిపోవడం అనే కాన్సెప్టుకు చైతూ ఎందుకు ఆకర్షితుడవుతున్నాడో అర్థం కావడం లేదు. అఖిల్ కూడా తన తొలి సినిమా టైమ్‌లోనే మాస్, యాక్షన్ కథని ఎంచుకొని తప్పు చేశాడు. ఇప్పుడు ఆ సంగతి అర్థమై.. లవ్ స్టోరీలైతేనే బెటర్ అని ఫిక్సయ్యాడు. మరి ఇన్ని సినిమాలు చేసిన అనుభవం ఉన్న చైతూ.. తనకేం కావాలో తెలుసుకోకపోవడం విచిత్రమే.