నాగచైతన్య ఇది వరకు వేదికలపై పెద్దగా మాట్లాడేవాడు కాదు. నామ్ కే వాస్తే అన్నట్టే సాగేవి ఆయన స్పీచ్‌లు. కానీ ఇప్పుడు మాటలు నేర్చుకొన్నాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలో బాగా అర్థమైంది. ‘తండేల్’ ట్రైలర్ లాంచ్‌లో నాగ చైతన్య స్పీచ్ ఆకట్టుకొంది. వైజాగ్‌లో ఈ ఫంక్షన్ జరిగిన సంగతి తెలిసిందే. వైజాగ్ వాసుల్ని ఆకట్టుకోవడానికి సెంటిమెంట్ ప్రయోగించాడు చైతూ. చైతూ జీవిత భాగస్వామి శోభితది విశాఖపట్నమే. అందుకే ఆ అస్త్రాన్ని ఇక్కడ వాడాడు. ”వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం. వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నా. నా ఇంట్లో వైజాగ్ వుంది. తనదే డామినేషన్. ఈ సినిమా వైజాగ్‌లో బాగా ఆడాలి. లేదంటే ఇంట్లో నా పరువు పోతుంది” అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు చైతూ. ఇప్పుడు చైతూ ఇచ్చిన స్పీచ్ వైరల్ అవుతోంది.
‘తండేల్’ ఉత్తరాంధ్ర నేపథ్యానికి సంబంధించిన కథ. శీకాకుళం యాసనీ, భాషనీ బాగా అర్థం చేసుకొన్నాడు చైతూ. అందుకోసం ప్రత్యేకంగా ట్యూటర్ ని పెట్టుకొన్నాడు. కొన్నాళ్లు ఆ ప్రాంత వాసులతో ప్రయాణం చేశాడు. అక్కడి అలవాట్లు తెలుసుకొన్నాడు. ఆఖరికి చేపల పులుసు కూడా వండడం నేర్చుకొన్నాడు. చైతూ కెరీర్లో ముఖ్యమైన సినిమా ‘తండేల్’. ఈ సినిమా కోసం వంద కోట్లు ఖర్చు పెట్టారు. సినిమా అవుట్ పుట్ కూడా బాగా వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే నాగచైతన్య, అల్లు అరవింద్ చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నారు. ట్రైలర్ బాగుంది. పాటలూ నచ్చాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఇది సాయి పల్లవి సినిమా. కాబట్టి… అంచనాలు పెరిగాయి. ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.