మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ సినిమాను నాగ చైతన్య, శృతి హసన్, అనుపమ పరమేశ్వరన్ లతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమాను చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమాకి మొదట ‘మజ్నూ’ అనే టైటిల్ అనుకొన్నారు. కానీ ఇప్పుడు దానికి మలయాళంలో ఉన్న ప్రేమమ్ అనే పేరునే ఖాయం చేసినట్లు తెలుస్తోంది. అది వెరైటీ కూడా ఉండటం, ఆ పేరుతో మలయాళంలో సినిమా హిట్ అవడం కారణంగా ఆ పేరుని ఖాయం చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయిపోయింది. నాగ చైతన్య, శృతి హసన్, అనుపమ పరమేశ్వరన్ లపై విదేశాలలో రెండు పాటలు చిత్రీకరించవలసి ఉందని సమాచారం. అది కాక కొంత టాకీ పార్ట్ కూడా చిత్రీకరించవలసి ఉంది. అవన్నీ మార్చి నెలాఖరులోగా పూర్తి చేసి ఏప్రిల్ నెలాఖరుకి లేదా మే నెల మొదటివారంలో ఈ సినిమా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఈ సినిమాలో విశేషం ఏమిటంటే కొందరు ప్రముఖ హీరోలు అతిధి పాత్రలలో కనిపించబోతున్నారు. నాగ చైతన్య మూడు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో శ్రుతీ హాసన్ లెక్చరర్ పాత్రలో కనిపించబోతోంది. ఈ మధ్యనే విడుదలయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ చాలా ఆకట్టుకొంటోంది.