ఊహలు గుసగుసలాడే సినిమాతో ఆకట్టుకున్నాడు నాగశౌర్య. అక్కడి నుంచి తన ప్రయాణం దిగ్విజయంగానే సాగుతూ ఉంది. మధ్యలో విజయాలొచ్చాయి, పరాజయాలూ పలకరించాయి. కాకపోతే ఇప్పుడు ఓ హిట్టు కొట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే నాని, శర్వాలాంటి యువ హీరోలంతా జోరుమీదున్నారు. తనకీ ఓ హిట్టు పడిపోతే రేసులోకి రావొచ్చు. ఆ ఛాన్స్ `ఛలో` కల్పిస్తుందని నమ్ముతున్నాడు శౌర్య. రష్మిక కథానాయిక నటించిన ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. సినిమా కూడా పూర్తయింది. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఫైనల్ కాపీ చూసుకున్న శర్వా అన్ని విధాలా సంతృప్తిగా ఉన్నాడని తెలుస్తోంది. వెంకీ త్రివిక్రమ్ శిష్యుడు. త్రివిక్రమ్ స్థాయిలో కాకపోయినా గురువుని గుర్తుకు తెచ్చేలా కొన్ని సీన్లు డిజైన్ చేశాడట. అవి హిలోరియస్గా వచ్చాయని, కథ.. కథనాల్లో కొత్తదనం ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుందని తెలుస్తోంది. ఇది నాగశౌర్య సొంత సినిమా. అందుకే ఖర్చుకి ఎక్కడా వెనుకంజ వేయకుండా క్వాలిటీ సినిమాని తీసుకొచ్చాడు. ఇప్పటికే శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయాయి. బిజినెస్ కూడా ఆశాజనకంగా ఉండడంతో అప్పుడే ఓ హిట్టు పడిపోయిందన్న ఆనందంలో ఉన్నాడు శౌర్య. మరి బాక్సాఫీసు రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.