ప్రతిభావంతమైన యువ కథానాయకులలో నాగశౌర్య ఒకడు. చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే, జ్యో అత్యుతానంద, ఛలో.. ఇలా తన కెరీర్లో మంచి హిట్స్ ఉన్నాయి. తనపై నమ్మకంతోనే తల్లిదండ్రులు నిర్మాణ సంస్థని సైతం స్థాపించారు. ఆ బ్యానర్లో వచ్చిన తొలి సినిమా ‘ఛలో’ మంచి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. అయితే `నర్తన శాల` మాత్రం దారుణంగా నిరాశ పరిచింది. ఇప్పుడు ఆ లెక్క సరిచేయాలన్న ఉద్దేశంతో తీసిన సినిమా ‘అశ్వద్ధామ’. ఈ సినిమాపై మాత్రం శౌర్య చాలా నమ్మకం పెంచుకున్నాడు. జనవరి 31న `అశ్వద్ధామ` ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా నాగశౌర్యతో చిట్ చాట్.
హాయ్ శౌర్య..
హాయ్ అండీ.
ఈ సినిమాతో మీరు బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారనిపిస్తోంది. నిజమేనా?
– అవునండీ. చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యే ఈ కథ రాశాను. రాస్తున్నప్పుడు, తీస్తున్నప్పుడు, నటిస్తున్నప్పుడు, ఇప్పుడు కూడా నేను ఎమోషనల్‌గా ఫీలవుతూనే ఉన్నాను. ఈ కథ నా గుండెని అంతగా పట్టేసింది. ఇదే అనుభూతి ప్రేక్షకుడికీ కలుగుతుందని నమ్ముతున్నాను.
ఈ సినిమా నన్ను చాలా మార్చింది అన్నారు. ఏ రూపంలో..?
– అన్ని రకాలుగానూ. అందుకే ఈ సినిమా పేరుని పచ్చబొట్టుగా పొడిపించుకున్నాను. ఈ సినిమా వల్ల నాకెన్ని డబ్బులొస్తాయో తెలీదు గానీ, మంచి పేరొస్తుంది. ఈ అనుభవాలు, జ్ఞాపకాలు జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను.
కథ మీరే రాశారు కదా, డైరెక్షన్ కూడా చేసేద్దామని అనిపించలేదా?
– అస్సలు లేదండీ. ఆ ఆలోచనే రాలేదు. రమణ తేజ నా స్నేహితుడే. ఈ కథ రాస్తున్నప్పటి నుంచీ నాతో ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఏ సీన్ ఎలా తీయాలి? ఏ లెన్సులు వాడాలి? ఎంత నిడివి ఉండాలి.. ఇవన్నీ ముందే రాసుకున్నాం. దాని ప్రకారమే సినిమా తీశాం.
నర్తన శాల రిజల్ట్ తరవాత, అశ్వద్ధామ మొదలవ్వక ముందు… మీ మానసిక పరిస్థితి ఏమిటి?
– ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ రోజు ఎలా ఉంటుంది? ఎంత నిశ్శబ్దంగా ఉంటుంది. అలాంటి వాతావరణం మా ఇంట్లో ఆరు నెలలుంది. డబ్బులు పోయాయని కాదు, మా అమ్మానాన్నలకు తల వంచుకునేలా చేశానే అని చాలా బాధ పడ్డా. నా జీవితంలో అలాంటి పొరపాటు మళ్లీ చేయను.
అసలు ఆ సినిమా ఎందుకు చేయాల్సివచ్చింది. సినిమాపై అతి నమ్మకమే కొంప ముంచిందా?
– ఇచ్చిన మాట కోసం చేసిన సినిమా అది. మాట ఇచ్చి తప్పితే, ప్రాణం పోయినట్టే లెక్క. డబ్బులు పోతే పోయాయి, మాట నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఆ సినిమా చేశాను. అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమీ లేదు. ఆ సినిమా పోతుందని నాకు తెలుసు. అందుకే `నచ్చితే సినిమా చూడండి. నచ్చకపోతే మరో ముగ్గురికి చెప్పండి` అని ముందే చెప్పాను.
లవర్ బోయ్ ఇమేజ్ ఉంది కదా, ఇప్పుడు ఇలాంటి సినిమాతో యాక్షన్ ఇమేజ్ దక్కించుకోవాలనుకుంటున్నారా?
– అదేం లేదండీ. నాగశౌర్య ఏమైనా చేయగలడు అనిపించుకోవాలని వుంది. అయితే నా దగ్గరకు అన్నీ ప్రేమకథలే వస్తున్నాయి. ప్రతీసారీ ఓ పువ్వు పట్టుకుని, అమ్మాయి వెంట తిరగడం బోర్ కొట్టేసింది. అందుకే ఇలాంటి కథ రాసుకున్నాను.
షూటింగ్ సమయంలో దెబ్బలు కూడా బాగా తగిలించుకున్నట్టున్నారు..
– అవును. ఈ సినిమాకి ఏం చేసినా మనసు పెట్టి చేయాలనుకున్నాను. యాక్షన్ మాస్టర్లు సైతం `ఇది సినిమా అండీ.. కొంత మాయ చేయాలి..` అని సర్దిచెప్పడానికి చూశారు. కానీ నేను వినలేదు. దాంతో దెబ్బలు తినాల్సివచ్చింది.
కథ మీరే రాసుకున్నారు. మీరే హీరో. నిర్మాత కూడా మీరే. మీ పాత్రని బాగా ఎలివేట్ చేయాలన్న స్వార్థం రాలేదా?
– లేదండీ. ఏ సినిమా అయినా ఓ పాత్ర బాగుంటే చాలదు. అన్ని పాత్రలూ బాగుండాలి. హీరో పాత్ర ఎలివేట్ అవ్వాలంటే విలన్ పాత్ర ధీటుగా రాసుకోవాలి. ఈసినిమాలో ప్రతి పాత్రకూ ఓ అర్థం ఉంటుంది. అనవసరమైన పాత్రలేం ఉండవు. హీరో కదా అని నా పాత్రకు బిల్డప్పులూ ఇచ్చుకోలేదు.
ఐరా క్రియేషన్స్ పై తదుపరి సినిమా ఎప్పుడు?
– త్వరలోనే. అయితే ఈసారి హీరో నేను కాదు. మరో హీరోతో సినిమా చేస్తాం. కథ మాత్రం నేనే రాస్తాను.
క్రిష్‌తో ఓ సినిమా ఉంటుందన్నారు..
– ఉంటుందండీ. కథ తయారవుతుంది. త్వరలోనే ఆ సినిమా కూడా పట్టాలెక్కుతుంది.