నాగశౌర్యకి యూత్ లో మంచి ఫాలోయింగ్ వుంది. యూత్ ఫుల్ కథలు ఎంచుకుంటూ తనకంటూ ఒక మార్క్ సంపాదించుకున్నాడు శౌర్య. ఇప్పుడు శౌర్య నుంచి మరో యూత్ ఫుల్ ఫ్యామిలీ డ్రామా వస్తుంది. అదే వరుడు కావలెను. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రమిది. లక్ష్మీసౌజన్య దర్శకత్వం. సితార బ్యానర్ నుంచి సినిమా రావడం, ట్రైలర్ టీజర్ ఆకట్టుకోవడంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా శౌర్య పంచుకున్న వరుడు కావలెను ముచ్చట్లివి.
ఆకాష్ పాత్రలోకి ఎలా వచ్చారు ?
2018 ఛలో సక్సెస్ మీట్ సమయంలో డైరెక్టర్ లక్ష్మీసౌజన్యతో పరిచయం. ఒక కథ వుంది వింటావా అన్నారు. విన్నా. నచ్చింది. అంతా ఓకే అనుకున్న సమయానికి కరోనా వచ్చింది. రెండేళ్ళు పోయింది. ఫైనల్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం.
ఆకాష్ పాత్ర చెప్పినపుడు మీకు నచ్చిన పాయింట్ ?
ముఫ్ఫై ఏళ్ళుకి దగ్గర పడుతుంటే సొసైటీ లో కామన్ గా పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న చాలా ఈజీగా అడుగుతారు. కానీ వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోరు. అసలు వాళ్ళు పెళ్లికి రెడీగా వున్నారో లేరో కూడా తెలుసుకోరు. ఇలాంటి టాపిక్ పై సినిమా కథ చెప్పిన వెంటనే ఒప్పుకున్నా. మనం చాలా వింటూ వుంటాం. చాలా కామన్ ఇష్యూ ఇది. అందరికీ తెలుసు. కానీ ఇదివరకు ఎవరూ చూపించలేదు. వరుడు కావలెను లో అదే పాయింట్ చూస్తారు.
మహిళా దర్శకురాలితో పని చేయడం ఎలా అనిపించింది ?
చాలా ప్రశాంతం గా వుంది. అమ్మాయిలకి సహనం ఎక్కువ. అంత త్వరగా టెంపర్ కోల్పోరు. సెట్స్ లో ఎవరికీ ఇబ్బంది లేకుండా అన్నీ సమకూర్చుతారు.
ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ బావుటుందని త్రివిక్రమ్ చెప్పారు. దాని గురించి?
త్రివిక్రమ్ గారు ప్రి రిలీజ్ ఈవెంట్ కి రావడం, సినిమా గురించి చెప్పడం గొప్పగా వుంది. త్రివిక్రమ్ ఈ సినిమా కోసం ఓ సీన్ రాశారు. ఆ సీన్ లో నేను యాక్ట్ చేశాను. ఆయన రాసిన డైలాగులు చెప్పాను. చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాలో ఒక పదిహేను నిమషాల ప్లాష్ బ్యాక్ వుంటుంది. ఆడియన్స్ చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతారు.
సినిమా తర్వాత పెళ్లి చూసుకోవాలని అనిపించిందా ? వదువు కావలెను అని అంటారా ?
హహ.. ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని వుంటుంది. కళ్యాణం వచ్చిన కక్కువచ్చిన ఆగదు( నవ్వుతూ). అయితే అదెప్పుడో చెప్పలేను. పెళ్లి జరిగితే మాత్రం ఖచ్చితంగా మంచి విందు భోజనం పెడతాను.
ఫస్ట్ కాపీ చూసుకున్నపుడు ఎలా అనిపించింది ?
సినిమా రష్ చూసినప్పుడు.. బాగా వస్తుందని అనిపించింది. ఎడిటింగ్ లో చూసుకున్న తర్వాత మనం అనుకున్నదాని కంటే బాగా వస్తుందని అనిపించింది. ఫైనల్ అవుట్ పుట్ చూసిన తర్వాత సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అనిపించింది. సినిమా బాగాలేకపోతే మొదట నాకే తెలిసిపోతుంది. ఈ సినిమాపై పూర్తి కాన్ఫిడెన్స్ తో వున్నా.
వరుడు కావలెను ఎలాంటి కథ ?
యూత్ ఫుల్ లవ్ స్టొరీ. అయితే చాలా పరిణితి గల ప్రేమ కథ. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేకథ.
అల్లు అర్జున్ సెల్ఫ్ మేడ్ స్టార్ అని చెప్పడం ఎలా అనిపించింది ?
చాలా హ్యాపీ. ఇండస్ట్రీ నేపధ్యం లేకుండా ఇక్కడికి వచ్చాను. ఐతే వచ్చిన తర్వాత చాలా మంది ప్రోత్సహించారు. బన్నీ గారు ఇచ్చిన కాంప్లీమెంట్ మరింత ఉత్సాహం ఇచ్చింది. ఇంకా హార్ట్ వర్క్ చేయాలనే ఇన్సప్రెషన్ కలిగించింది.
రీతు వర్మ గురించి ?
చాలా మంచి అమ్మాయి. అందమైన అమ్మాయి. మంచి నటి. చక్కగా తెలుగు మాట్లాడుతుంది. తనే డబ్బింగ్ చెప్పుకుంది. భవిష్యత్ లో రీతూ ఇంకా సినిమాలు ఉండొచ్చు.
లక్ష్య లో కొత్తగా కనిపిస్తున్నారు ? దాని గురించి ?
లక్ష్యలో నాలుగు వేరియేషన్స్ వున్నాయి. వరుడు కావలెను రెండు. మరో సినిమాలో మూడు. సినిమా సినిమాకి విభిన్నంగా కనిపించాలానే ఆలోచన వుంది. ఈ సినిమా కోసం పదహారు కేజీలు పెరిగి మళ్ళీ పదహారు కేజీలు తగ్గా. అది మీరు తెరపై చూస్తారు.
స్పెషల్ గా డైట్ చేస్తున్నారా ?
గత రెండేళ్ళుగా అన్నీ పచ్చివే. పచ్చగా ఏం కనిపించినా తినేస్తున్నా ( నవ్వుతూ)
సితార బ్యానర్ గురించి ?
చాలా మంచి బ్యానర్. వంశీ, చినబాబు గారు చాలా మంచి మనుషులు. సినిమాకి ఏం కావాలో అవి సమకూర్చుతారు. సినిమా జరుగుతున్నపుడు వారి ప్రోత్సాహం మర్చిపోలేను.
ఆకాష్ రొమాంటిక్ , మీ వరుడు కావలెను బాక్సాఫీసు వార్ ఎలా వుంటుంది ?
బాక్సాఫీసు వార్ ఏమీ లేదు. రెండూ గెలవాలి.
కొత్త సినిమాలు గురించి ?
నవంబర్ లో లక్ష్య వస్తుంది. అనీష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న. అవసరాల శ్రీనివాస్ తో ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి సినిమా చేస్తున్న. ఇంకొన్ని కథలు విన్నా. ఫైనల్ చేయాలి.
అల్ ది బెస్ట్
థ్యాంక్ యూ.