ఛలోతో నిర్మాతగానూ సక్సెస్ కొట్టాడు నాగశౌర్య. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ సినిమాకి కథకూడా తనే అందించాడు. ఆ తరవాత ఐరా క్రియేషన్స్‌లో తీసిన `నర్తన శాల` డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాకి మాత్రం.. నాగశౌర్య కథాసాయం చేయలేదు. ఆ పని కూడా దర్శకుడికి వదిలేశాడు. ఇప్పుడు ఐరా మూడో సినిమాకి శ్రీకారం చుట్టింది. ఈ సినిమా హిట్టవ్వడం శౌర్యకి చాలా అవసరం. హీరోగా తన కెరీర్‌కీ, నిర్మాతగా తన సంస్థకూ… ఈ సినిమానే ఊపిరి. అందుకే… ఇంకాస్త జాగ్రత్తగా అడుగులేద్దామనుకుంటున్నాడు. ఛలో సెంటిమెంట్ కొనసాగిస్తూ. ఈ సినిమాకి కూడా తనే కథని రాసుకున్నాడు. తన స్నేహితుడైన రమణ తేజకు దర్శకత్వ బాధ్యత అప్పగించాడు. తప్పుల్ని ఎదిరించే ఓ కుర్రాడి కథ ఇది. మరి ఆ తప్పుల్ని సరిద్దడంలో తాను ఎలాంటి తప్పులు చేశాడన్నది కథాంశం.
నర్తనశాల విషయంలో నాగశౌర్య చాలా తప్పులు చేశాడు. మరీ ముఖ్యంగా బడ్జెట్ పరిధులు దాటింది. ఛలో ఇచ్చిన ధైర్యమో, మితిమీరిన ఆత్మ విశ్వాసమో తెలీదు గానీ… తన స్థాయికి మించి భారీగా ఖర్చు పెట్టాడు. అలాంటి పొరపాటు ఈ సినిమాకి చేయకూడదని నాగశౌర్య భావిస్తున్నాడట. తన మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని, పరిమిత బడ్జెట్‌తో ఈ సినిమా తీయాలని డిసైడ్ అయ్యాడు. ఈసారి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.