నిన్న జరిగిన ఛలో సినిమా ప్రి-రిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ఫిబ్రవరి 2 న విడుదల కానున్న ఈ సినిమా పాటలు ఆల్రెడీ జనం లోకి బాగానే వేళ్ళాయి. తమిళ నాడు-ఆంధ్ర సరిహద్దు గ్రామం లో జరిగే కథ గా రానున్న ఈ సినిమా పై ఆల్రెడీ మంచి బజ్ ఉంది. ఇక చిరంజీవి సమక్షం లో జరిగిన ప్రి-రిలీజ్ ఫంక్షన్ తో మరింత క్రేజ్ వచ్చింది ఈ సినిమాకి. ఇక ఫంక్షన్ సందర్భంగా హీరో నాగశౌర్య చిరంజీవి ని ఆకాశానికెత్తేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇంతకీ శౌర్య ఏమన్నాడంటే –
“అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవిగారికి ధన్యవాదాలు. నేను చాలా చాలా చిన్నవాడ్ని. నన్ను సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన చేయి నా భుజంపై పడింది. అది చాలు. సర్.. ఏమైపోయారు సార్.. 10 సంవత్సరాలు ఇటువంటి ఫంక్షన్లకి, అభిమానులకు దూరంగా ఎలా ఉన్నారు సార్. మీరు లేకపోవడంతో ఇండస్ట్రీ మొత్తం ఆడియో ఫంక్షన్లని హోటల్స్‌లో జరుపుకునే స్థాయికి పడిపోయింది. అది ఆడియో రిలీజా, రిసెప్షనా అనేది అర్ధం కాకుండా జరుపుకుంటున్నాం మేము. మళ్లీ మెగాస్టార్ వచ్చారు. ఆడియో రిలీజులంటే ఏంటో చూపిస్తాం. 100 రోజులు చూస్తాం. మళ్లీ 175 రోజులు కూడా చూస్తాం. చిరంజీవి నటించిన రోజులలో 1,2,3,4 అనే నెంబర్ కుర్చీలు ఉండేవి. ఆయన వెళ్లిపోయిన తర్వాత కుర్చీలు లేవ్. అందరూ నిలబడటమే. మళ్లీ వచ్చారు. కుర్చీ తెచ్చుకున్నారు. ఆయనే వేసుకు కూర్చున్నారు. ఆ కుర్చీ కోసం ఎవరూ రారు. రాలేరు. కూర్చోలేరు. ఆ కుర్చీ ఆయనది కాదు. ఆయన కోసమే కుర్చీ పుట్టింది. మీకు చాలా ధన్యవాదాలు సార్. మళ్లీ జన్మంటూ ఉంటే మా అమ్మనాన్నలకు కొడుకుగానే పుడతాను. మళ్లీ మెగాస్టార్ అభిమానిగానే పెరుగుతాను. ఈ ఫంక్షన్‌కి వచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు సార్.”
మొత్తానికి నాగ శౌర్య స్పీచ్ అటు సభకి వచ్చిన ఆడియెన్స్ ని, ఇటు టివిల్లో చూసిన మెగాభిమానులని బాగానే ఆకట్టుకుంది.