‘ఛలో’ తో ఓ సూపర్ హిట్ కొట్టాడు నాగశౌర్య. తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇది. అదికూడా తన సొంత సంస్థలో చేసిన సినిమా. అందుకే…. శౌర్య ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ ఆనందంలోనే ‘@ నర్తన శాల’ అనే కొత్త సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నాడు. తన చేతిలో ఇప్పుడు రెండు సినిమాలున్నాయి. ‘కణం’, ‘అమ్మమ్మగారి ఇల్లు’. వీటిపైనే శౌర్య బెంగ. ‘కణం’ పూర్తిగా సాయి పల్లవి చుట్టూ తిరిగే కథ. ఈ సినిమా బాగా ఆడినా.. పేరంతా ఆ అమ్మాయికి వెళ్లిపోతుంది. ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం అది నాగశౌర్య ఎకౌంట్లో పడిపోతుంది. ‘అమ్మమ్మగారి ఇల్లు’ పై కూడా శౌర్యకు కొన్ని అనుమానాలున్నాయి. అసలు ఈ పేరుతో ఓ సినిమా తయారైందన్న సంగతే ప్రేక్షకులకు తెలీదు. దానికి కారణం.. ఇప్పటి వరకూ ఆ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ మొదలవ్వకపోవడమే. ‘ఛలో’ సినిమాకి దగ్గరుండి మరీ పబ్లిసిటీ చేసుకున్నాడు శౌర్య. సొంత సినిమా కాబట్టి ఆమాత్రం కష్టం తప్పదు. పబ్లిసిటీ విషయంలో చూపించిన శ్రద్ద.. ఛలోకి బాగా కలిసొచ్చింది. కణం, అమ్మమ్మగారి ఇల్లు ప్రొడ్యూసర్లు ఈ స్థాయిలో పబ్లిసిటీ చేయలేరు. దాంతో పాటు ఆ రెండు సినిమాలపై ఎలాంటి బజ్ లేదు. ఈ రెండు సినిమాల ప్రభావం తన కెరీర్‌పై ఎలా చూపిస్తాయో అన్న టెన్షన్లో ఉన్నాడు శౌర్య. మరి ఏం జరుగుతుందో చూడాలి.