సరైన బ్రేక్ రావడం లేదని, కొడుకు హీరో నాగశౌర్య కోసం రంగంలోకి దిగి ఛలో సినిమా నిర్మించారు శంకర్ ప్రసాద్. ఆ సినిమాను కాస్త రీజనబుల్ బడ్జెట్ లోనే తీసారు. అడ్వాన్స్ ల మీద విడుదల చేసి, హిట్ కొట్టి, కాస్త బాగానే లాభాలు చేసుకున్నారు. ఎప్పుడైతే బ్రాండ్ వాల్యూ వచ్చిందో, ఇప్పుడు రెండో సినిమా @నర్తనశాల స్టార్ట్ చేసారు.
ఈ సినిమాకు ఏకంగా పది కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. సినిమాలో అధికభాగం రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేయడం, అలాగే 60 లక్షలతో కేవలం ఒక పాటకు అన్నపూర్ణలో సెట్ వేయడం, సాంగ్స్ ను ఇటలీలో ప్లాన్ చేయడం వంటి వాటితో పాటు, కేవలం పబ్లిసిటీకి రెండు కోట్లు బడ్జెట్ పెట్టుకున్నారట.
ఛలో సినిమా పబ్లిసిటీ ఇండస్ట్రీలో చాలా మంది దృష్టిని ఆకట్టుకుంది. ఆ సినిమాకు కొటీ ముఫై లక్షలు పబ్లిసిటీకి ఖర్చు చేసారు. ఇప్పుడు అంతకు మరో డెభై లక్షలు ఎక్కువ బడ్జెట్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నారట. నిన్నటికి నిన్న మీడియా మొత్తాన్ని సెట్ కు తీసుకుపోయి, సెట్ చూపించి, భోజనాలు పెట్టి, హడావుడి చేసారు. ఛలో సినిమాకు కూడా ఇలాగే తరచు మీడియా మీట్ లు పెట్టి, మంచి పబ్లిసిటీ సంపాదించారు. ఇప్పుడు కూడా ప్రారంభం నుంచే అదే రూట్ లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
అన్నట్లు ఈ సినిమా తరువాత నాగశౌర్య ఓన్ బ్యానర్ పై వేరే హీరోతో కూడా సినిమాలు ప్లాన్ చేయడం విశేషం.