‘ఛలో’తో నాగశౌర్యలో జోష్ పెరిగింది. చక చక సినిమాలు చేసేస్తున్నాడు. తను కథానాయకుడిగా నటించిన ‘@ నర్తనశాల’ వచ్చే వారం విడుదల అవుతోంది. భవ్య క్రియేషన్స్ రూపొందిస్తున్న ‘నారీ నారీ నడుమ మురారీ’ చేతిలో ఉంది. ఇప్పుడు ‘గణ’ అనే మరో సినిమా చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల శిష్యుడు తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది కూడా శౌర్య సొంత సంస్థ ఐరా ప్రొడక్షన్స్ లోనే తెరకెక్కబోతోంది. ఇందులో కథానాయకుడి పేరు ‘గణపతి’. ముద్దుగా ‘గణ’ అని పిలుచుకుంటారు. అదే టైటిల్ గా ఫిక్సయ్యింది. తేజ న్యూయార్క్ లో దర్శకత్వ విభాగంలో శిక్షణ పొందాడు. నాలుగు హాలీవుడ్ చిత్రాలకూ సహాయకుడిగా పనిచేశాడు. ‘ఫిదా’లో కొంత భాగం అమెరికాలో తెరకెక్కింది. ఆ సమయంలో.. అక్కడ శేఖర్ కమ్ములతో కలసి పనిచేశాడు. ‘గణ’ కూడా కొత్త తరహా కథేనట. వినోదం, ప్రేమ, యాక్షన్.. ఈ అంశాలన్నీ మిళతమై సాగుతుందట. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తారు.