సినిమా అంటేనే హీరో చుట్టూ తిరిగేది. వాళ్ల చుట్టూ హీరోయిన్లు తిరుగుతారు. అయితే అప్పుడప్పుడూ ఈ సీన్ రివర్స్ అవుతూ ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు హీరోల్ని పక్కన పెట్టి హీరోయిన్లు డామినేట్ చేస్తుంటారు. ఒక్కో సినిమాకి హీరో కంటే హీరోయిన్ గురించే ఎక్కువ మాట్లాడుకొంటుంటారు. ఇప్పుడు ఒక మనసు సినిమాకీ అదే జరుగుతోంది. మెగా డాటర్ నిహారిక కథానాయికగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. అందరి చూపూ నిహారికపైనే. అందులో నాగశౌర్య హీరోగా చేస్తున్నాడని, అతనికీ గతంలో కొన్ని విజయాలున్నాయని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మొన్నటి ఆడియో ఫంక్షన్ కూడా ట్రాక్ తప్పి బన్నీ స్పీచ్పైకి మళ్లింది. మిగిలిన వాళ్లు నిహారిక గురించి గొప్పగా చెప్పేశారు. వాళ్ల మధ్య ఆటలో అరటిపండుగా మిగిలిపోయాడు నాగశౌర్య.
రేపొద్దుట సినిమా విడుదలైనా అదే పరిస్థితి. ఈ సినిమాలో సంధ్యగా కనిపించనుంది నిహారిక. ఆమె పాత్ర.. అందులో ఆమె నటన సూపర్బ్ అని తెలుస్తోంది. సినిమా హిట్టయితే ఆ క్రెడిట్ అంతా నిహారిక పట్టుకెళ్లిపోవడం ఖాయం. అప్పుడు కూడా తనని ఎవ్వరూ పట్టించుకోరు. అందుకే నాగశౌర్య ఇప్పుడు తెగ ఫీలవుతున్నాడట, ఈ సినిమా ఒప్పుకోకుండా ఉండాల్సింది అని సన్నిహితుల దగ్గర చెప్పుకొంటున్నాడని టాక్.