హీరోల తనయులు, దర్శకుల తనయులు, నిర్మాతల తనయులు, ఫైట్ మాస్టర్స్ తనయులు… తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది వారసులు హీరోలుగా వస్తున్నారు. కొందరు మాత్రం తండ్రి పేరు తెచ్చుకున్న శాఖలో తమ ప్రతిభను చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఒకరు. కుర్రాడిలో విషయం వుంది. అయితే గతేడాది వరకూ చెప్పుకోదగ్గ విజయాలు రాలేదు. ‘ఛలో’తో విజయం అందుకున్నాడు. అంతే కాదు… ‘ఛలో’ తరవాత ఆ సినిమా హీరో నాగశౌర్య సంతకం చేసిన ప్రతి చిత్రానికి మహతి స్వరసాగర్ పేరు సంగీత దర్శకుడిగా కనిపించింది. దీని వెనుక నాగశౌర్య రికమండేషన్ వుందని టాక్. అతడికి, సంగీత దర్శకుడికి ఫ్రెండ్షిప్ బాగా కుదిరింది. దాంతో మిగతా విషయాల సంగతి ఎలా వున్నా మ్యూజిక్ విషయంలో హీరో పట్టు పడుతున్నాడట. నిజానికి, నాగశౌర్య, మహతి స్వరసాగర్ కాంబినేషన్లో ‘ఛలో’ మొదటి సినిమా కాదు. మూడేళ్ళ క్రితం యాక్షన్ ఇమేజ్ కోసం నాగశౌర్య ట్రై చేసిన ‘జాదూగాడు’కి మహతి మ్యూజిక్ అందించాడు. అది హీరోకి బాగా నచ్చేసింది. అందుకని, ఫ్యామిలీ నిర్మించిన ‘ఛలో’కి కావాలని మహతి స్వరసాగర్ని తీసుకున్నాడు. ఈసారి పాటలతో పాటు సినిమా కూడా హిట్టు. దాంతో మణిశర్మ తనయుణ్ణి నాగశౌర్య వదలట్లేదు. ‘ఛలో’ తరవాత సొంత సంస్థలో ప్రారంభించిన ‘@నర్తనశాల’కి, తాజాగా భవ్య క్రియేషన్స్ ఆనందప్రసాద్ నిర్మాణంలో ప్రారంభించిన కొత్త సినిమాకి మహతి స్వరసాగర్ని సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు నాగశౌర్య.