సాధారణంగా తమ సినిమా వస్తోందంటే… ‘గత సినిమా కంటే ఈ సినిమాలో ఇంకా పొడిచేశాం.. చించేశాం’ అని చెబుతుంటారు. తీరా చూస్తే… రిజల్ట్ తేడాగా ఉంటుంది. ఇలాంటి మాటల్ని కూడా జనం నమ్మడం మానేశారు. అయినా సరే, ఉన్నది ఉన్నటు మాట్లాడేవాళ్లు ఇండ్రస్ట్రీలో కరువైపోయారు. యంగ్ హీరోలు కూడా… ఫాల్స్ ప్రెస్టేజీతో మాట్లాడడం మొదలెట్టేశారు. ఇలాంటి తరుణంలో నాగశౌర్య స్పీచ్.. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే స్వభావం ఆకట్టుకుంది. ఆయన కథానాయకుడిగా నటించిన సినిమా ‘నర్తనశాల’. ఈనెల 30న విడుదల అవుతోంది. ఈరోజు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ పంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా నాగశౌర్య స్పీచ్ ఆకట్టుకుంది. ‘ఛలో’లో ‘చూసీ చూడంగానే’ అనే పాట సూపర్ హిట్టయ్యింది. ఆ సినిమా విజయంలో ఆ పాట కూడా ఓ కీలక పాత్ర పోషించింది. అందుకే.. ఈ సినిమాకి సాగర్ మహతిని సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు. ‘నర్తనశాల’లోనూ మంచి పాటలు కుదిరాయి. అయితే.. ‘చూసీ చూడంగానే’ స్థాయిని మాత్రం అందుకోలేకపోయామని ఒప్పుకున్నాడు శౌర్య. ”అద్భుతాలు ఒకేసారి జరుగుతాయి. మళ్లీ అలాంటి పాట కోరుకోవడం కూడా మూర్ఖత్వమే అవుతుంది. అయినా సరే ట్రై చేశాం. ఆ స్థాయికి అందుకోలేకపోయినా.. దానికంటే ఓ మెట్టు కిందనుండే పాటలు చేశాం..” అని నిజాయతీ చూపించాడు. ”ఈ సినిమా బాగోలేకపోతే చూడొద్దు. బాగుంటే మాత్రం పదిమందికి చెప్పండి” అంటున్నాడు శౌర్య. ‘నర్తనశాల’ టీజర్లకు, పాటలకూ మంచి స్పందన వస్తోంది. దానికి తోడు ఈవారం సోలో రిలీజ్ దక్కింది. సినిమాపై కూడా పాజిటీవ్ బజ్ నడుస్తోంది. సో.. ఇవన్నీ ఈ సినిమాకి కలిసొచ్చే ఛాన్సులున్నాయి.