ఎందుకో రివ్యూల పేరు ఎత్తగానే అగ్గిమీద గుగ్గిలం అయిపోతుంటారు నాగవంశీ. ‘గుంటూరు కారం’తో ఆ మంట కనిపించింది. ఆ తరవాత కాస్త చల్లబడ్డారు. ‘ఇక రివ్యూల గురించి మాట్లాడను’ అనేశారు. కానీ ఇప్పుడు మళ్లీ ఆయనకు రివ్యూ రైటర్లపై కోపం వచ్చేసింది. ఇది వరకెప్పుడూ లేనంతగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మ్యాడ్ 2’కి నెగిటీవ్ రివ్యూలు రావడమే అందుకు కారణం. ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ… తన ఆవేశాన్ని వెల్లగక్కారు. ”మీరూ నేనూ ఒకే ఇండస్ట్రీలో బతుకుతున్నాం. మా మీద, మీ మచ్చే ఇంటర్వ్యూల మీద, మా యాడ్స్ మీద వెబ్ సైట్లు రన్ అవుతున్నాయి. దమ్ముంటే నన్ను, నా సినిమాల్నీ బ్యాన్ చేయండి” అంటూ… ఫైర్ అయ్యారు నాగవంశీ.
ఆయన్నుంచి ఇటీవలే ‘మ్యాడ్ 2’ వచ్చింది. ‘మ్యాడ్ 1’తో పోలిస్తే.. 2 నిరాశ పరిచిన మాట వాస్తవం. దాంతో రివ్యూలన్నీ ‘యావరేజ్’ మార్కులు ఇచ్చాయి. కానీ కుర్రాళ్లు మాత్రం ఈ సినిమాకు పట్టం కట్టారు. మంచి వసూళ్లు వచ్చాయి. రెండో రోజే ఈ సినిమా లాభాల బాట పట్టింది. దాంతో.. ఇప్పుడు రివ్యూలపై తీరిగ్గా విరుచుకుపడే అవకాశం దక్కింది నాగవంశీకి. రివ్యూలు బ్యాడ్ గా ఉన్నా, సినిమా ఆడేసిందని, కంటెంట్ లేకపోతే జనాలు సినిమాలు చూడరని, రివ్యూలు చూసి అస్సలు రారని, కేవలం అది ఓ వ్యక్తి అభిప్రాయం మాత్రమే అని… చెప్పుకొచ్చారు నాగవంశీ. ”ఆ రోజు పెళ్లాంతో గొడవైతే.. రివ్యూ బాడ్ గానే వస్తుంది” అంటూ రివ్యూ రైటర్లపై సెటైర్ కూడా వేసేశారు.
”రివ్యూలు రాయండి.. తిట్టండి… నేనేం అనుకోను. కానీ సినిమా బాగా ఆడుతున్నప్పుడు కూడా దానికి వంకలు పెట్టొద్దు.. సినిమాని మళ్లీ తొక్కేస్తూ మీ రివ్యూల్ని జస్టిఫై చేయడానికి ప్రయత్నించొద్దు. ఏడాదికి నాలుగైదు సినిమాలు తీసేవాడ్ని. నాతోనే ఇలా ఉంటే, కొత్త వాళ్ల పరిస్థితి ఏమిటి” అని ప్రశ్నించారు నాగవంశీ.
ప్రతీ సినిమాకీ నాగవంశీతో ఉన్న గొడవే ఇది. రివ్యూలు చూస్తే ఆయనకు కోపం కట్టలు తెంచుకొంటుంది. దాన్ని మీడియా ముందు కక్కేస్తారు. ఆ తరవాత.. మళ్లీ మామూలే. సినిమా బాగుంటే, రివ్యూలు బాగా వస్తాయి. నచ్చకపోతే రావు. వాటికీ వసూళ్లకూ సంబంధం లేదు అన్నప్పుడు రివ్యూల్ని అంత సీరియస్ గా తీసుకోవడం ఎందుకు? ప్రతీ విషయాన్నీ లాజిక్, ప్రాక్టికల్ గా ఆలోచించే నాగవంశీ… రివ్యూల వరకూ వచ్చేసరికి ఆ మెచ్యూరిటీ ఎందుకు చూపించలేకపోతున్నారో?