ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ‘గుంటూరు కారం’ ఒకటి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. కానీ వాటిని ఈ సినిమా అందుకోలేదన్నది నిజం. వసూళ్ల మాటెలా ఉన్నా, అభిమానుల ఆశలకూ, అంచనాలకూ ఆమడ దూరం నిలబడిపోయింది ఈ సినిమా. పండగ అయిపోయింది. ఈ సినిమా రిజల్ట్ పై ఓ క్లారిటీ వచ్చింది. దాంతో నిర్మాత నాగవంశీ పెదవి విప్పారు. ఈ సినిమా రిజల్ట్ పై ఆయన తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు.
‘గుంటూరు కారం’ ఫ్యాన్స్ షో తరవాత.. కాస్త కన్ఫ్యూజన్ మొదలైందని, వచ్చిన డివైడ్ టాక్ ఇబ్బంది పెట్టిందని ఒప్పుకొన్నారు వంశీ. అయితే మెల్లగా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కి చేరువ అయ్యిందని, అందుకే ఈ స్థాయి వసూళ్లు వచ్చాయని చెప్పుకొచ్చారాయన. కొన్ని మీడియా హౌస్‌లు పనిగట్టుకొని మరీ నెగిటీవ్ రివ్యూలు ఇచ్చాయని, అయినా వసూళ్లపై ప్రభావం చూపించలేదని అయితే సినిమాని ప్రమోట్ చేయడంలో తమ తప్పులూ ఉన్నాయని ఒప్పుకొన్నారు. గుంటూరు కారం సినిమాని ఓ మాస్ చిత్రంగా ఫ్యాన్స్ భావించారని, కానీ.. తాము ఫ్యామిలీ సినిమా తీశామని, అందుకే కాస్త నిరుత్సాహపడ్డారని చెప్పారు. సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలన్న ఉద్దేశంతో క్షణం తీరిక లేకుండా గడిపామని, అందుకే ప్రమోషన్లకు సమయం దొరకలేదన్నారు వంశీ. ఓవర్సీస్లో గుంటూరు కారం అనుకొన్న వసూళ్లు సాధించలేకపోయింది. దీనిపై కూడా వంశీ క్లారిటీ ఇచ్చారు. కొన్ని సినిమాలు కొన్ని కొన్ని ఏరియాల్లో బాగా ఆడతాయని, కొన్ని ఏరియాల్లో తక్కువ వసూళ్లు సాధించినంత మాత్రాన ఫ్లాప్‌గా లెక్కగట్టకూడదని చెప్పుకొచ్చారు వంశీ. పండగ సినిమా కాబట్టే గుంటూరు కారానికి వసూళ్లు వచ్చాయన్న కామెంట్ లో నిజం లేదని, సినిమా బాగోలేకపోతే పండగ టూమ్ లో రిలీజ్ చేసినా ఉపయోగం ఉండదని, తమ సినిమా ఒకటి గతంలో పండగ రోజే విడుదలైందని, కానీ ఫ్లాప్ అయిందని పరోక్షంగా ‘అజ్ఞాతవాసి’ రిజల్ట్ ని గుర్తు చేశారు వంశీ.