వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చిరంజీవి రాజ్యసభకు వెళ్లడం లేదని ఆయన సోదరుడు నాగేంద్రబాబు ప్రకటించారు. చిరంజీవి అసలు ఇక రాజకీయాల్లోకి రారని.. తమ్ముడు పవన్ కల్యాణ్ కోసం.. ఆయన తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేశారని.. నాగబాబు స్పష్టం చేశారు. మళ్లీ చిరంజీవికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని …వైసీపీ తరపున చిరంజీవికి రాజ్యసభ సీటు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలలో చిరంజీవికి ఆత్మీయులు, అభిమానులున్నారుని.. ఆయన కోరుకుంటే ఏ పార్టీలోనైనా సముచిత స్థానం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే.. తమ్ముడు పవన్ కోసం అన్నయ్య రాజకీయ జీవితం త్యాగం చేసేశారని స్పష్టం చేశారు.
అమరావతి రైతులకు తాను, పవన్ అండగా నిలబడ్డామని .. చిరంజీవి రాజధానిపై తన అభిప్రాయం చెప్పి ఉండొచ్చని.. అంత మాత్రానా ఇంటిని ముట్టడిస్తామంటే ఊరుకుంటామా అని ప్రశ్నించారు. రాజకీయ స్వార్ధం కోసం చిరంజీవిని వివాదాల్లోకి లాగొద్దని నాగబాబు విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన చిరంజీవి… ప్రత్యేక హోదా సహా అన్ని విషయాల్లోనూ సైలెంట్ గా ఉన్నట్లే… అమరావతి విషయంలోనూ ఉంటే సరిపోయేది.. అయితే.. చిరంజీవి.. ప్రత్యేకంగా మూడు రాజధానులకు మద్దతుగా ప్రకటన చేయడంతోనే.. సమస్య వచ్చింది. అదే సమయంలో.. జగన్మోహన్ రెడ్డితో ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది.
దాంతో.. వైసీపీ తరపు న చిరంజీవిని రాజ్యసభకు పంపుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. దీనిపైనే నాగబాబు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పటికైతే.. చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రారని చెప్పేశారు. కానీ.. అది శాశ్వత నిర్ణయమని మాత్రం .. చెప్పలేం.. ఎందుకంటే.. రాజకీయ నేతల నిర్ణయాలు ఒకే మాట మీద ఉండవు మరి.