ఆ మధ్య అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు తన రక్తం మరిగిపోతుంది అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వాదనకు కౌంటర్ ఇస్తూ చంద్రబాబు నాయుడు, బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన మోసానికి తన రక్తం మరిగిపోతోంది అంటూ వ్యాఖ్యానించారు. మామూలుగా అయితే ప్రజలందరూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించే వారే కానీ, గత నాలుగేళ్లలో పలుమార్లు బిజెపికి తానే మద్దతిచ్చి, బిజెపిని తానే వెనకేసుకుని రావటం వల్ల చంద్రబాబు నాయుడు విశ్వసనీయత కోల్పోవడం తో, చంద్రబాబు నాయుడు చేసిన రక్తం మరిగిపోతోంది వ్యాఖ్యలకు సానుకూల స్పందన రావడం మాట అటుంచి ట్రోలింగ్ ఎక్కువగా జరిగింది. గతంలో హోదా కంటే ప్యాకేజీ ముద్దు అని తను చెప్పినప్పుడు, హోదా అని ఎవరైనా అంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది అని తాను వ్యాఖ్యానించినప్పుడు, అన్నింటికీ మించి నాలుగేళ్లపాటు ఎన్డీఏలో పదవులు తీసుకున్నప్పుడు మీ రక్తం మరగ లేదా బాబు అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు.
https://www.telugu360.com/te/chandrababu-naidu-about-ap-special-status/
అయితే ఇదే టాపిక్ మీద వీడియో చేసిన నాగబాబు చంద్రబాబు పై సెటైర్లు వేశారు. పాలు మరగాలంటే నాలుగున్నర నిమిషాలు చాలని కానీ చంద్రబాబు నాయుడు రక్తం మరగాలంటే నాలుగున్నర సంవత్సరాలు పట్టింది అని నాగబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు . అలాగే పాలు తొందరగా మరగాలంటే ఎక్కువ మంట పెట్టాలని, కానీ బాబు రక్తం మరగాలంటే ఎలక్షన్లు రావాల్సిందేనని నాగబాబు చలోక్తులు విసిరారు.
ఏది ఏమైనా నాగబాబు వీడియోలు వ్యంగ్యంగా సరదాగా ఉంటూనే, ఇటు జనసేన పార్టీ ప్రత్యర్థుల మీద ప్రజల్లో నెగటివ్ ఇమేజ్ కలిగేలా ప్రయత్నిస్తుండటంతో జనసేన అభిమానులకు మాత్రం ఈ వీడియోలు ఫుల్ జోష్ ఇస్తున్నాయి.