నరసాపురం ఎంపీ స్థానానికి జనసేన తరపున నాగబాబు పోటీకి దిగిన సంగతి తెలిసిందే. ఆయన అక్కడ టీడీపీకి గట్టి పోటీ ఇస్తున్నారు. సమీకరణాలన్నీ కలసి వస్తే నాగబాబు గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదని అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు. ఎంపీగా గెలిస్తే నాగబాబు సినిమాలు మానేస్తారా? జబర్దస్త్ షోలో కనిపించరా? అనే సందేహాలు కలగడం సహజం. అయితే.. నాగబాబు ఆలోచన మరోలా ఉంది. సినిమాలు చేయకపోయినా, జబర్దస్త్ మాత్రం వదలనని ఆయన గట్టిగా చెబుతున్నారు.
”జబర్దస్త్ లాంటి కార్యక్రమానికి జడ్జ్‌గా వ్యవహరించడం కూడా ఓరకంగా సమాజసేవలాంటిదే. కాకపోతే.. ఇక్కడ మాకంటూ కొంత పారితోషికం ఇస్తారు. జనసేన ప్రచారం కోసం వెళ్లినప్పుడు ‘ఎంపీగా గెలిచినా జబర్దస్త్‌లో కనిపించడం మానకండి’ అని చాలామంది నన్ను అడిగారు. నెలకు 5 రోజులు జబర్దస్త్‌కి కేటాయిస్తే సరిపోతుంది. అందుకే ఆ కార్యక్రమం వదలను. కానీ సినిమాల్లో మాత్రం నటించలేను” అని క్లారిటీ ఇచ్చాడు.
ఇటీవల నాగబాబుపై శివాజీరాజా ‘పిల్లికి కూడా బిచ్చం పెట్టడు. నరసాపురం ఎంపీగా నాగబాబుని గెలవకూడదు’ అంటూ స్టేట్మెంట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై నాగబాబు తొలిసారి స్పందించాడు. శివాజీ రాజా కామెంట్లని లైట్ తీసుకున్నాడు. ‘ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. ఇంతకంటే పెద్ద పెద్ద విషయాలపై పోరాటం చేస్తున్నాను..’ అంటూ సమాధానం చెప్పారు. ‘మా అధ్యక్షుడిగా కొత్తవారికి అవకాశం ఇద్దామన్న ఉద్దేశంతోనే నరేష్ వెంట ఉన్నాను. నిజానికి నరేష్ కంటే శివాజీరాజా నాకు బాగా కావల్సినవాడు. కానీ… రెండేళ్ల కాలంలో శివాజీ రాజా పనితీరు నాకంతగా సంతృప్తిగా అనిపించలేదు’ అంటున్నాడు నాగబాబు. ఎన్నికల ఫీవర్ ఎలాగూ అయిపోయింది కాబట్టి… నాగబాబు – శివాజీ రాజా ఎపిసోడ్‌కీ మంగళం పడిపోయినట్టే.