హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై మెగా బ్రదర్ నాగబాబు మండిపడ్డారు. నిన్న చిరంజీవి జన్మదిన వేడుకల కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మెగా హీరోల కార్యక్రమాలన్నింటిలో పవన్, పవన్ అంటూ నినాదాలు చేస్తూ కొందరు అభిమానులు అంతరాయం కలిగించటం, ఇది చిరంజీవితోసహా అందరికీ ఇబ్బంది కలిగించటం తెలిసిందే. నిన్నకూడా అలాగే పవన్ గురించి నినాదాలు చేస్తున్న అభిమానులపై నాగబాబు మండిపడ్డారు. పవన్ రాకపోతే తామేం చేయాలని ప్రశ్నించారు. అన్ని కార్యక్రమాలకూ పవన్‌ను ఆహ్వానిస్తూనే ఉన్నామని, అతను రావటంలేదని చెప్పారు. అంతగా అడగాలనుకుంటే, అంత దమ్ముంటే ఈ విషయాన్ని వెళ్ళి పవన్నే అడగాలని తీవ్రస్వరంతో హెచ్చరించారు. పవన్ రాకపోవటంపై ప్రతిసారీ తాము సంజాయిషీ ఇచ్చుకోవలసి వస్తోందని చెప్పారు. నాగబాబు ఈ హెచ్చరిక చేస్తున్నపుడు చిరంజీవితో సహా మెగా కుటుంబమంతా వేదిక కిందే ఉంది.
చిరంజీవి సినిమారంగంనుంచి తప్పుకోవటం, పవన్‌కు వరుస బంపర్ హిట్లు రావటంతో ఇప్పుడు మెగాస్టార్కంటే పవర్‌స్టార్‌కి పాపులారిటీ అనూహ్యంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అదే మెగా హీరోల కార్యక్రమాలలో అభిమానుల నినాదాలరూపంలో ప్రతిఫలిస్తోంది. దానిని చిరంజీవికూడా జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆయా సందర్భాలలో ఆయన ముఖకవళికలలలో స్పష్టంగా కనబడుతున్న విషయం తెలిసిందే.