జనసేన నేత మరియు మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల చేస్తున్న ట్వీట్స్ వివాదాస్పదం అవుతున్నాయి. ఇటీవల చేసిన గాడ్సే ట్వీట్ మీద కొన్ని మీడియా సెక్షన్స్ నాగబాబుని చీల్చి చెండాడేశాయి. అయినా కూడా నాగబాబు వాటిని పట్టించుకోకుండా మరొకసారి అదే తరహా ట్వీట్స్ చేశాడు. అయితే ఈసారి గాడ్సే ఇలాంటి వివాదాస్పద పేర్ల జోలికిపోకుండా రాణా ప్రతాప్ సింగ్, చత్రపతి శివాజీ వంటి పేర్లను ప్రస్తావిస్తూ అహింస, శాంతి కంటే కూడా హింసతో కూడిన దేశభక్తి మంచిదే అన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశాడు.
నాగబాబు ట్వీట్ చేస్తూ, ” భారతీయుల రక్తం శాంతి,అహింస మంత్రాలతో ,చల్లబడి పోయింది.తిరిగి రక్తం వేడెక్కలంటే ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్ సింగ్, అశోక చక్రవర్తి, సామ్రాట్ పృథ్విరాజ్ చౌహన్, శ్రీకృష్ణ దేవరాయలు, రాజ రాజ చోళుడు, సముద్రగుప్తుడు మొదలైన మహావీరుల కథలని పిల్లలతో చదివిస్తే నెక్స్ట్ జనరేషన్ అయినా సాహసం, పౌరుషం, మరిగే రక్తం తో పెరుగుతారు. ఎలాగూ మన రక్తం చల్లబడి పోయింది. వాళ్ళనన్నా దేశానికి ఉపయోగ పడే వీరులు గా తయారు చేద్దాం. భారత దేశానికి, దేశాన్ని ప్రేమించేవీరులు కావాలి, డబ్బుకు ఓట్లు వేసే సాధారణ పౌరులు కాదు. దేశాన్ని పట్టి పీడిస్తున్న దేశ ద్రోహులు, గుండాలు, మాఫియా, ఫ్యాక్షన్, గుండా రాజకీయ నాయకులు, కుహనా ఉదారవాదులు, ఉగ్రవాదుల నించి ఈ దేశాన్ని కాపాడే వీరులు కావాలని నా కోరిక. ప్రతి నేరాన్ని పోలీస్, మిలిటరీ మాత్రమే డీల్ చెయ్యాలంటే కుదరని పని.” అని రాసుకొచ్చారు.
నాగబాబు చేసిన ఈ ట్వీట్ కి మెగా అభిమానుల నుంచి, అతివాదం తో కూడిన దేశభక్తులు అయిన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకులని గాంధీ నెహ్రూల వంటి మితవాద నాయకుల కంటే ఎక్కువగా అభిమానించే జనాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ, అహింస సిద్ధాంతాన్ని నాగబాబు కించపరచడం పై మరొక వర్గం నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. జనసేన బిజెపితో పొత్తు లో ఉన్న దరిమిలా, నాగబాబు కావాలనే బిజెపి భావజాలాన్ని జనాల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు అని మరొక వర్గం అంటున్నారు. నాగబాబు చేస్తున్న ట్వీట్స్ చివరకు ఏ పరిణామాలకు దారితీస్తాయి అన్నది వేచి చూడాలి.