భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు 1960వ దశకం నుండి ఉన్నాయి. అప్పుడప్పుడు హిందీ చీనీ భాయి భాయి అంటూ సత్సంబంధాలు నెరపడం, మళ్ళీ అప్పుడప్పుడు చైనా కయ్యానికి కాలు దువ్వడం దశాబ్దాలుగా జరుగుతోంది. అయితే ఇటువంటి ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడల్లా, చైనా ఉత్పత్తులను వాడటం భారతీయులు మానేయాలని దేశంలో ఎవరో ఒకరు పిలుపునివ్వడం జరుగుతోంది. ఇప్పుడు తాజాగా చైనా భారత్ ల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డ సమయంలో నాగబాబు కూడా ఇదే తరహా ట్విట్ చేశారు. నాగబాబు ట్వీట్ కి మిశ్రమ స్పందన వచ్చింది. వివరాల్లోకి వెళితే..
నాగబాబు ట్వీట్ చేస్తూ ” మన దేశాన్ని ఆక్రమించుకోవలని చూస్తున్న చైనా వస్తువుల్ని,సెల్ ఫోన్ apps ని బహిష్కరిద్దాం.మన దేశం లో తయారైన వస్తువుల ని కొందాం.ప్రపంచం లో మన దేశం పెద్ద మార్కెట్.అన్ని దేశాల వస్తువులు ఇక్కడ అమ్మి సొమ్ము చేసుకొని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు..అదే మన ప్రొడక్ట్స్ ని మనమే కొంటె మన దేశమే లాభపడుతుంది.తిరిగి ఆ డబ్బుతో మన దేశం అభివృద్ధి చెందుతుంది.మనందరం బాగుపడతాం.మన డబ్బు మన దేశంలో నే వుంటుంది, మనమే బాగుపడదాం. అంతే కాని మన డబ్బుతో బాగుపడి మన దేశాన్ని అక్రమించుకోవలని చూసే చైనా వస్తువుల్ని బ్యాన్ చేద్దామ్. ” అని రాసుకొచ్చారు.
అయితే నెటిజన్ల నుండి దీనికి మిశ్రమ స్పందన వచ్చింది. మీ కుటుంబ సభ్యులు టిక్ టాక్ లాంటివి వాడడం మానేయండి అని కొందరు ఘాటుగా విమర్శిస్తే, మరికొందరు మాత్రం ఉద్దేశం మంచిదే అయినా ఆచరణాత్మకం కాదని సమాధానం ఇచ్చారు. ఇంకొందరైతే డబ్ల్యుటివో నిబంధనల నేపథ్యంలో అది సాధ్యం కాదని, కాబట్టి ఇలా చైనా ఉత్పత్తులను బ్యాన్ చేయడం కాకుండా ఇంకేదైనా మెరుగైన ఉపాయాన్ని ఆలోచించాలని హితవు పలికారు.