నరసాపురం ఎంపీ స్థానానికి జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న నాగబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నరసాపురం ఎంపీ నియోజకవర్గం కింద వచ్చే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ, వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు, టీడీపీ ఎంపీ అభ్యర్థి శివరామరాజు మీద నేరుగా విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు.
Click here:
https://www.telugu360.com/te/raghu-ramakrishnaraju-to-face-heat-for-comments-on-ys-jagan/
గతం లో వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సమయంలో రఘురామకృష్ణంరాజు, వైయస్ జగన్ ని అపరిచితుడు సినిమాలోని పాత్ర తో పోలుస్తూ జగన్ సైకో అన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో నాగబాబు.. గతంలో రఘు రామకృష్ణంరాజు వైయస్ జగన్ మీద చేసిన వ్యాఖ్యలు నిజమే అంటూ, ఆయన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు. అలాగే తాను సినిమాల్లోనూ సీరియళ్లలోనూ విగ్ పెడతానని, ఇప్పుడు మాత్రం అలాంటివి ఏవీ లేకుండా వచ్చానని, కానీ రఘురామకృష్ణంరాజు మాత్రం జుట్టంతా ఊడిపోయినా ఇప్పుడు విగ్ పెట్టుకుని జనంలోకి వస్తున్నాడని సరదా వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇంతలోనే సరదా వ్యాఖ్యలతో పాటు, రఘురామకృష్ణంరాజు గతంలో 350 కోట్ల రూపాయలకు బ్యాంకులకు టోకరా ఇచ్చాడని, ఈ విషయంపై తన మీద కేసులు నడుస్తున్నాయని, అవి కూడా సాదాసీదా కేసులు కావని, జగన్ మీద మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసుల వంటి కేసు లేనని, ప్రజలందరూ దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని, అలాంటి ఈడీ కేసులు ఉన్న వ్యక్తి మనకు ఎంపీగా రావడం అవసరమా అని వ్యాఖ్యానించారు.
అలాగే, టీడీపీ తరఫున పోటీ చేస్తున్న శివరామరాజు, జిల్లాలోని నీటిని నేలను గాలిని కలుషితం చేశాడని, ఈ శివరామరాజుని గెలిపించినా, రఘురామ కృష్ణంరాజును గెలిపించినా.. ఇద్దరు కూడా పార్లమెంటుకు వెళ్లిన దగ్గర నుంచి ఎన్ని కొత్త ప్రాజెక్టులు సొంత ప్రయోజనాల కోసం తెచ్చుకోవాలి, ఎన్ని పవర్ ప్రాజెక్టులు తెచ్చుకోవాలి అని ఆలోచిస్తారు తప్ప నియోజకవర్గం గురించి అసలు ఆలోచించరని నాగబాబు అన్నారు. రాజులలో తనకు ఎంతో మంది స్నేహితులున్నారని, ఈ రఘురామకృష్ణంరాజు, శివరామరాజు లాంటి వారి వల్ల తమ పరువు పోతుందని వారు తన దగ్గర ఎన్నోసార్లు వాపోయారని చెప్పుకొచ్చిన నాగబాబు ఓటు వేసే ముందు ఒక క్షణం ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను కోరారు.