వీరిద్దరి మధ్య ‘మా’ పోరు పతాక స్థాయికి చేరింది. 800 ఓటర్లు ఉండే ‘మా’లో.. ఎవరికెన్ని పడతాయన్న లెక్కలు, ఎవరు గెలుస్తారు? అనే అంచనాలు తారా స్థాయి చేరుతున్నాయి. నిన్నా మొన్నటి వరకూ శివాజీరాజా గెలుపుపై ఎవ్వరికీ అనుమానాలు ఉండేవి కావు. ఎందుకంటే.. ‘మా’లో బలమైన శక్తిగా నిలిచిన `మెగా` కాంపౌండ్ అండ శివాజీరాజా వైపే ఉంది. ‘ఈసారి నువ్వు నిలబడాల్సిందే’ అని చిరంజీవి శివాజీరాజాపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు.. `మా` వర్గాలు చెబుతున్నాయి.
అయితే సడన్‌గా నాగబాబు నరేష్‌కి మద్దతు తెలపడం చర్చనీయాంశమైంది. ఆమధ్య టాలీవుడ్లో కొన్ని విపరీతమైన ఘటనలు జరిగాయని, ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నా – మా పట్టించుకోలేదని – ఆ విషయంలో తాను చాలా బాధ పడ్డానని, అందుకే ఈసారి నరేష్‌కి అవకాశం ఇద్దామనుకుంటున్నానని నాగబాబు ప్రకటించంతో.. `మా` గేమ్ మొత్తం మారిపోయింది. చిరంజీవిది ఒకదారి, నాగబాబుది ఒకదారి ఎప్పటికీ కాదు. అన్నమాటే.. తమ్ముడి బాట. అలాంటప్పుడు నాగబాబు నరేష్ వైపు ఎందుకు మొగ్గు చూపుతాడు? అనేది పెద్ద ప్రశ్న.
నాగబాబుని హర్ట్ చేసిన విషయాల్లో పవన్ కల్యాణ్ – శ్రీరెడ్డి వివాదం ఒకటి. శ్రీరెడ్డి కెమెరా ముందు ‘అమ్మ’నా బూతులు తిట్టినప్పుడు ‘మా’ ప్రతిఘటించలేకపోయింది.. ఆ తతంగాన్ని ఆపలేకపోయింది. ఆనాడే పవన్ కూడా ఛాంబర్‌కి వచ్చి హంగామా సృష్టించాడు. మెగా హీరోలతో పాటు మిగిలినవాళ్లూ కలసి మీటింగులు పెట్టారు. ఇదంతా ‘మా’ వైఫల్యం కిందే లెక్కగట్టాడు నాగబాబు. ఆనాడు పవన్‌ని హర్ట్ చేయడం వల్లే.. ఇప్పుడు శివాజీరాజాని కాదని, నరేష్ వైపు మొగ్గు చూపుతున్నాడు నాగబాబు. ఎప్పుడైతే నరేష్ వైపుకి నాగబాబు వచ్చాడో…’మా’ సమీకరణాలు మొత్తం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం నాగబాబు ఒక్కడే.. నరేష్ వైపు ఉన్నాడా? ఈ విషయంలోనూ మెగా ఫ్యామిలీ మొత్తం కూడబలుక్కున్నారా? అలాగైతే శివాజీరాజాకి చిరంజీవి ఇచ్చిన మాట ఏమైపోతుంది? అనేవి అంతు చిక్కని ప్రశ్నలుగా మారాయి.