టీడీపీ, జనసేన పొత్తు ఖరారు కావడంతో ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా కలిసి పోటీ చేసేందుకు ఓట్ల బదిలీ సాఫీగా జరిగేందుకు..క్యాడర్ మధ్య సమన్వయం సాధించే బాధ్యతను మెగా బ్రదర్ నాగబాబు తీసుకున్నారు. జిల్లాల టూర్లు ప్రారంభించారు. మొదటి ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. నిస్వార్థంగా పని చేసే ప్రతి కార్యకర్తకీ మంచి భవిష్యత్ జగన్ దుర్మార్గ, దౌర్జన్య పాలనను అంతమొందించాలంటే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క జన సైనికుడు, వీరమహిళ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. పొత్తులకు తూట్లు పొడిచేలా ఎవరూ ఎక్కడా మాట్లాడొద్దు… పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి కట్టుబడి పనిచేయడం మనందరి బాధ్యత అని ఉపదేశం ఇచ్చారు.
పదేళ్లు ఎదురుచూశాం. మరికొద్ది రోజులు క్రమశిక్షణగా పని చేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం. వచ్చేది ముమ్మాటికి జనసేన, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వమే. కష్టపడి, నిస్వార్థంగా పని చేసే ప్రతి కార్యకర్తకు మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో జగన్ దిట్ట అని ఆయన మాటలు విని అధికారులు తప్పులు చేయ వద్దు అని త నాగబాబు పిలుపునిచ్చారు. తిరుపతిలో ఆయన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తప్పులు చేసిన ప్రతి అధికారి భవిష్యత్తులో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే రాష్ట్రం అథోగతి పాలైందని తెలిపారు. మరోసారి ఛాన్స్ ఇస్తే ప్రజల ఆస్తులను లాక్కుంటారన్నారు. జనసేన, టీడీపీ కలిసి పని చేస్తేనే వైసీపీ దౌర్జన్య పాలనకు అంతం పలుకుతుందన్నారు.
రాష్ట్రంలో రౌడీయిజం, గూండాయిజం పెరిగిపోయిందని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు కంటికి కనిపించిన భూములను కబ్జాలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, దేవుడి భూములు అని చూడకుండా కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. వారి దౌర్జన్యాలు, దాష్టీకాలపై మాట్లాడితే దాడులకు పాల్పడుతున్నారు. అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ సంక్షేమం ముసుగులో ప్రభుత్వ ఆస్తులను ఇష్టానుసారం తాకట్టు పెడుతున్నాడు. మరోసారి ఆయనకు అధికారం ఇస్తే మన ఇంటి పత్రాలను కూడా బలవంతంగా లాక్కొని మరి తాకట్టు పెడతాడని జోస్యం చెప్పారు. నాగబాబు మరిన్ని జిల్లాల పర్యటనలు నిర్వహించే అవకాశం ఉంది.