జనసేన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగబాబు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటి వరకూ ఆయన ఆన్ లైన్ సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు నేరుగా జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. ఎలమంచిలి నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని నాగబాబు ప్రారంభించనున్నారన్నారు. అనకాపల్లి పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జనసేన పార్టీ కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. వీటిని ప్రారంభించడానికి నాగబాబు ఇక రెగ్యూలర్గా జిల్లాలు పర్యటించే అవకాశం ఉంది.
ఇప్పటి వరకూ నాదెండ్ల మనోహర్ జనసేన తరపున ఫీల్డ్ విజిట్స్ చేపట్టేవారు. ఇప్పుడు నాగబాబు కూడా ఆ బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇటీవల జనసేన పార్టీ వ్యవహారాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నాగబాబు తీరు కూడా వేరుగా ఉంటోంది. నాగబాబు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు ఏదో జరుగుతోందన్న అభిప్రాయం కల్పించేలా ఉన్నాయి. మన వేలే మన కన్ను పొడుస్తుందని ఆయన పెట్టిన ఓ ట్వీట్ వైరల్ అయింది. జనసేనలో ఏదో జరుగుతోందన్న అభిప్రాయం కల్పించింది.
గతంలోలా పవన్ కల్యాణ్.. పార్టీ మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. గతంలో వారాంతాల్లో అయినా ఏపీలో పర్యటించేవారు. ఇటీవలి కాలంలో అది కూడా లేదు. ఆ లోటును పూడ్చడానికి ఎక్కువగా నాగబాబు జిల్లాల్లో పర్యటించాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని నాగబాబు చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు మనసు మార్చుకుంటారోమో తెలియదు కానీ.. ఎంపిక చేసిన నియోజవర్గాల్లో ఆయన పర్యటనలు ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉంది.