టిడిపి నేత అచ్చెన్నాయుడుని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అరెస్టు చేయడం రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇప్పటికే జనసేన పార్టీ నుండి అధికారిక స్పందన వచ్చినప్పటికీ అది అటు వైఎస్ఆర్సిపి నీ కానీ ఇటు టిడిపి ని కానీ పూర్తిగా సమర్ధించకుండా తటస్థంగా బ్యాలెన్స్డ్ గా ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. మెగా బ్రదర్ నాగబాబు ఈ వ్యవహారంపై పూర్తిగా టిడిపి వ్యతిరేక స్టాండ్ తీసుకొని ట్వీట్ చేశారు. గతంలో టిడిపి పెట్టిన అక్రమ కేసులను ప్రస్తావిస్తూ, ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాన్ని తాను స్వాగతిస్తున్నట్లు అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ కి మిశ్రమ స్పందన వస్తోంది.
నాగబాబు ట్వీట్ చేస్తూ,” టీడీపీ హయాం లో టీడీపీ నాయకురాలిని సోషల్ మీడియా లో ఏదో అన్నారు అని మా జనసేన కార్య కర్తల మీద దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేసి , వాళ్ళని గొడ్ల ని బాదినట్లు బాది,అంత హింస పెట్టిన టీడీపీ, ఇప్పడు ఒక నాయకుడి మీద స్కాం జరిగిందని పోలీస్ అరెస్ట్ చేస్తే టీడీపీ,,టీడీపీ అనుకూల మీడియా అంత గగ్గోలు పెడుతున్నారు,,వాళ్ళు ఆఫ్ట్రాల్ కార్యకర్తలు,, నాయకులు కారు అనేగా అప్పట్లో మీ ఉద్దేశ్యం..karma has no menu. You get what you deserve..మా జనసేన కార్యకర్తల ని అరెస్ట్ చేసి కొట్టించిన పాపం టీడీపీ కి అంత తేలిగ్గా పోతుందా . ..We never forget what you did to our janasainiks….” అని రాసుకొచ్చారు.
అయితే ఈ ట్వీట్ పై మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది టిడిపి అభిమానులైన నెటిజన్లు అప్పట్లో వైయస్ జగన్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అతని పెళ్లిళ్ల ప్రస్తావన చేస్తూ చేసిన వ్యక్తిగత విమర్శలను గుర్తుచేస్తూ, ఇప్పుడు అటువంటి వైఎస్ జగన్ కి ఎలా మద్దతిస్తున్నారు అంటూ ప్రశ్నించారు. అయితే జనసేన అభిమానులు మాత్రం నాగబాబు సరైన పంథాలోనే వెళ్తున్నాడని, టిడిపి జనసేన కార్యకర్తలను అప్పట్లో ఇబ్బంది పెట్టడం, పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా తమ అనుకూల మీడియాలో విపరీతంగా వ్యతిరేక కథనాలు ప్రోత్సహించడం చేసిందని, 2014లో పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా ఏ ప్రతిఫలం ఆశించకుండా టిడిపికి మద్దతు ఇచ్చినప్పటికీ గెలిచిన తర్వాత టిడిపి పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా వ్యూహాలు రచించడం, కొంతమంది టిడిపి నాయకులు- అసలు పవన్ కళ్యాణ్ ఎవరో మాకు తెలియదు అని అనడం జరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఏది ఏమైనా నాగబాబు ట్వీట్ జనసేన అభిమానులకు మోదాన్ని, టిడిపి అభిమానులకు ఖేదాన్ని తీసుకొచ్చింది.