వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమదే అధికారం అంటూ భాజపా నేతలు ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తుంటారు. తెరాసకు తామే ప్రత్యామ్నాయమనీ, అభివృద్ధి తమతోనే సాధ్యమంటారు. అంతేనా… భాజపాలో చేరేందుకు కొంతమంది ప్రముఖ నేతలు తమతో మంతనాలు జరుపుతున్నారనీ, త్వరలోనే భారీ ఎత్తున వలసలు ఉంటాయంటూ ఊరిస్తుంటారు. ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీస్తున్నామనీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారనీ చెబుతుంటారు. ఈ కోణం నుంచి చూస్తూ… తెలంగాణలో భాజపా శరవేగంగా బలోపేతం కాబోతున్న వాతావరణం కనిపిస్తుంది. కానీ, నాణానికి మరోవైపు… ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతల్నే భాజపా దూరం చేసుకుంటోంది. తాజాగా కొమ్మూరి ప్రతాపరెడ్డి పార్టీని వీడుతున్నట్టు స్పష్టం చేశారు. ఆయన బుజ్జగించేందుకు భాజపా నేతలు ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు! ఇక, సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి కూడా త్వరలోనే గుడ్ బై చెప్పేయడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే, కొత్త నేతల్ని ఆకర్షించాల్సిన ఈ తరుణంలో ఉన్నవారికి కోల్పోకుండా చూసుకోవాలన్న సోయి పార్టీకి ఇప్పుడు వచ్చినట్టుంది. అందుకే, నాగంను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. తాజాగా కొంతమంది భాజపా నేతలు నాగం ఇంటికి వెళ్లారట! తొందరపడి ఎలాంటి నిర్ణయాలూ తీసుకోవద్దనీ, పార్టీలో మంచి స్థానం లభిస్తుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినట్టు సమాచారం. అయితే, ఈ బుజ్జగింపులకు నాగం పెద్దగా స్పందించింది లేదని తెలుస్తోంది. అంతేకాదు… పార్టీ తీరు మార్చుకోకపోతే రాష్ట్రంలో భవిష్యత్తు ఉండదని బుజ్జగింపులకు వచ్చినవారి ముఖం మీదే చెప్పేశారట. కొంతమంది నేతలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ… మరికొంతమంది ప్రజల తరఫున పోరాటాలు అంటే ఎలా కుదురుతుందని వారిని నాగం ప్రశ్నించారట. తెలంగాణ భాజపాకి స్పష్టత లేదనీ, ముందుగా స్థానిక సమస్యలపై పార్టీ స్టాండ్ ఏంటనేది నిర్ణయించుకోకుంటే ప్రజలు ఆదరించనీ నాగం చెప్పారట. దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో… బుజ్జగించడానికి వచ్చినవారికి నాగం క్లాస్ తీసుకున్నదే ఎక్కువ అని సమాచారం.
తనకు పార్టీలో ప్రాధన్యత దక్కలేదు, చేపట్టిన పోరాటాలకు భాజపా నేతలు వెంట రాలేదన్న అసంతృప్తి నాగంకు ఉంది కాబట్టే ఇలా స్పందించారు అని చెప్పుకోవచ్చు! కానీ, దీన్లో కూడా వాస్తవ పరిస్థితిని వివరించారు. నిజానికి, అధికార పార్టీ తెరాసతో టి. భాజపాకు ఉన్న సంబంధం ఏంటనే స్పష్టత కరువైంది! కేంద్రంలో నరేంద్ర మోడీ ఏ నిర్ణయాలు తీసుకున్నా కేసీఆర్ శభాష్ అనేస్తుంటారు. దీంతో రాష్ట్రంలో తెరాసకు వ్యతిరేకంగా పోరాటాలంటే ఎలా చేయాలనే స్పష్టత నేతలకు లేకుండా పోతోంది. ఆకర్ష్ సంగతేమోగానీ, ముందుగా టి. భాజపా నేతలు దృష్టి సారించాల్సిన అసలు సమస్య ఇదే అనడంలో సందేహం లేదు.