తెలుగుదేశంలో ఒకప్పుడు కీలక నేతగా ఉండేవారు మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి. ఆ తరువాత, పార్టీ అధినాయకత్వంతో విభేదించి, భాజపాలో చేరిపోయారు. పార్టీ అయితే మారారుగానీ.. భాజపాలో పేరున్న నాయకుడిగా ఎదగలేకపోయారు. టీడీపీలో ఉండగా రాష్ట్ర స్థాయి నాయకుడిగా పార్టీలో ఆయనకు గుర్తింపు ఉండేది. ఇప్పుడు భాజపాలో జిల్లా స్థాయి నేతగా కూడా ఆయనకు ప్రాధాన్యత దక్కడం లేదన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. భాజపాలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తి నాగం వర్గంలో ఈ మధ్య కాస్త ఎక్కువైందని తెలుస్తోంది. టీడీపీ కీలక నేత రేవంత్ రెడ్డి పార్టీ మారిన దగ్గర్నుంచీ నాగం అనుచర వర్గంలో కూడా చర్చ మొదలైందని అంటున్నారు!
వచ్చే ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి పార్లమెంటు స్థానానికి మరో నేతకు అవకాశం ఇచ్చే దిశగా భాజపా నాయకత్వం ఆలోచిస్తోందట. అయితే, నాగం కూడా ఈసారి అసెంబ్లీకి రావాలనే భావిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో గత వైభవాన్ని పొందాలంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడమే కరెక్ట్ అని ఆయన భావిస్తున్నారు. ఒకవేళ భాజపా తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గానైనా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు కార్యకర్తలతో నాగం అంటున్నారట! అయితే, పైపైకి ఇలా చెబుతున్నా.. కాంగ్రెస్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా నాగం చేస్తున్నట్టు కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డికి నాగం సాయం చేశారట! నిజానికి, వీరిద్దరి మధ్యా ఒకప్పుడు రాజకీయ వైరం ఉండేది. కానీ, ఆయన విజయానికి నాగం చేయూత ఇచ్చేసరికి ఇద్దరు నేతలూ మిత్రులైపోయారు. ఇంకోపక్క… కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డితో కూడా నాగం ఈ మధ్య బాగా సన్నిహితంగా ఉంటున్నట్టు వినిపిస్తోంది. ఎలాగూ జైపాల్ రెడ్డితో నాగంకు బంధుత్వం కూడా ఉంది కదా! అది కూడా కలిసొచ్చే అంశమే కదా.
ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ కు నాగం దగ్గయ్యే క్రమంగా చూడొచ్చనేది కొందరి అభిప్రాయం. ఇతర పార్టీల్లోని కీలక నేతల్ని చేర్చుకునే క్రమంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి, ఈ దశలోనే నాగం కండువా మార్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. త్వరలోనే రాహుల్ గాంధీ రాష్ట్రానికి రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో రాహుల్ సమక్షంలో నాగం కూడా కాంగ్రెస్ లో చేరతారంటూ ప్రచారం మొదలైంది. భాజపాలో ఆయనకి భవిష్యత్తు కనిపించడం లేదు. పోనీ, రేవంత్ లేరు కాబట్టి సొంతగూటికి వెళ్లినా, అక్కడా ప్రాధాన్యత దక్కే అవకాశం తక్కువే. ఇప్పటికే గడచిన నాలుగేళ్లుగా రాజకీయంగా చాలా వెనకబడిపోయారనే భావన ఉండనే ఉంది. కాబట్టి, ఈ దశలో కాంగ్రెస్ లో చేరేందుకు నాగం సిద్ధంగా ఉన్నారంటూ కథనాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంపై నాగం స్పందన ఎలా ఉంటుందో చూడాలి! ‘తూచ్.. ఇవన్నీ పుకార్లు, నేను భాజపాలోనే కొనసాగుతానూ’ అని నాగం బల్లగుద్ది చెప్పే పరిస్థితి ప్రస్తుతానికి లేదనే అనిపిస్తోంది.