హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం మొత్తం కరవుతో విలవిలలాడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇప్పుడు చైనా పర్యటన అవసరమా అని భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, బచావో తెలంగాణ మిషన్ కన్వీనర్ నాగం జనార్దనరెడ్డి ప్రశ్నించారు. నాగం ఇవాళ రైతు భరోసా యాత్రలో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో జడ్చర్ల, కల్వకుర్తి, వెల్దండ మండలాల్లో పర్యటించారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న కరవు పరిస్థితులను తాను ఎన్నడూ చూడలేదని నాగం అన్నారు. కరవు ఇంత తీవ్రంగా ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి కరవు నివేదికకూడా పంపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 30 దాకా వేచిచూద్దామని చెప్పటం భావ్యంగా లేదన్నారు. సీఎమ్ చైనా పర్యటన కాక పంటచేల బాట పట్టాలని సూచించారు. మిషన్ కాకతీయ పథకంద్వారా కాంట్రాక్టర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలే బాగుపడ్డారని విమర్శించారు. రైతులు అధైర్య పడొద్దని, రైతాంగాన్ని కేసీఆర్ పట్టించుకోకుంటే గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని నాగం హెచ్చరించారు. ఇలాగే ఉంటే కేసీఆర్ చరిత్రహీనుడిలా మిగిలిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగం వెంట మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, దుష్యంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.
మరోవైపు తెలంగాణలో రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకోగా, గురువారం మరో ఐదుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ రెండుకోట్ల రూపాయల ఖర్చుతో చార్టర్డ్ ఫ్లైట్ వేసుకుని చైనాలో పర్యటించటం అందరూ వేలెత్తిచూపేలా ఉందనటంలో సందేహంలేదు.