హైదరాబాద్: నాగం జనార్దనరెడ్డి భారతీయజనతాపార్టీని వీడబోతున్నారని ఇవాళ స్పష్టమయింది. తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాడటానికంటూ మరో బీజేపీ నేత యెన్నం శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన ఇవాళ ప్రారంభించిన ‘తెలంగాణ బచావో మిషన్’ వేదికకు పార్టీ నాయకత్వంనుంచి అనుమతి లేదని రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు.
టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలపై తెలంగాణ బచావో మిషన్ పోరాటం చేస్తుందని నాగం చెప్పారు. కేజీ టు పీజీ ఉచిత విద్య, కరవు, ఆత్మహత్యలపై తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కేసీఆర్ చీప్ లిక్కర్ ఆలోచన విరమించుకోవాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులందరూ డమ్మీలయ్యారన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోవటం తప్పుకాదా అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
తెలుగుదేశంనుంచి బయటకొచ్చిన నాగం ఎన్నికలముందు బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో ఆయన ఇమడలేకపోతున్నారు. కొంతకాలంగా బీజేపీ కార్యాలయానికి దూరంగా ఉంటున్నారు. మరోవైపు రాష్ట్ర విభజన సమయంలో వెంకయ్యనాయుడుపై తీవ్ర విమర్శలు చేసిన మరో బీజేపీ నాయకుడు యెన్నం శ్రీనివాసరెడ్డికికూడా పార్టీలో సరైన ప్రాతినిధ్యం లభించటంలేదు. దీనితో వీరిద్దరూ కలిసి ఇవాళ తెలంగాణ బచావో మిషన్ను ప్రారంభించారు. ఇది ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.