కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మైకు పట్టుకున్నారంటే కేసీఆర్ దుమ్ము దులిపి ఆరేస్తారనే విషయం తెలిసిందే. రేవంత్ ప్రసంగాలకు అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. రేవంత్ ను కాంగ్రెస్ ఏరికోరి చేర్చుకోవడం వెనక ఇదీ ఒక కారణమే. అయితే, ఈ మధ్య రేవంత్ కాస్త దూకుడు తగ్గించారు! పార్టీలో తన స్థానమేంటో, ప్రాధాన్యత ఏపాటిదో అనే స్పష్టత వచ్చేవరకూ మౌనంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఈ మధ్య వ్యవహరిస్తున్నారు. అయితే, అవకాశం వస్తే తానూ రేవంత్ కి తీసిపోను అన్నట్టుగా కొత్తగా పార్టీలో చేరిన సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి కూడా మైకావేశంతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న తరువాత ఈ మధ్య నాగర్ కర్నూలులో పర్యటనలు పెంచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాదనీ, ఉద్యమం పేరుతో ఆయన చేసినవి దొంగ దీక్షలని నాగం మండిపడ్డారు. తానూ వైద్యుడనేననీ, నిరాహార దీక్ష చేస్తున్న కేసీఆర్ కు లిక్విడ్ డైట్ ఇచ్చేవారనీ, ఇలా చేస్తే దీన్ని నిరాహార దీక్ష అంటారా అంటూ నాగం మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనీ, సోనియా గాంధీ పిలుపు మేరకే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారని ప్రజలు గుర్తించాలన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేం లేదని ఎద్దేవా చేశారు. పనికి మాలిన చీరలు తీసుకొచ్చి మహిళలకు కానుకలు అంటూ అవమానించారనీ, ఎకరాకి ఓ నాలుగువేలు పడేసి రైతులకు మేలు చేస్తున్నట్టు గొప్పలకు పోతున్నారని నాగం మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓటు అడిగే హక్కు తెరాస నేతలకు లేదనీ, ఓటు కావాలంటూ అధికార పార్టీ నేతలు వస్తే తరిమికొట్టాలంటూ ఆవేశంగా ప్రసంగించారు.
ఇది ఎన్నికల ప్రచారమేమో అనే స్థాయిలో నాగం పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ నేతగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంగా దీన్ని చూడొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా స్థానిక కాంగ్రెస్ అభిమానులను తనవైపు తిప్పుకోవడం కోసం పడుతున్న ప్రయాసగా ఆయన తీరు కనిపిస్తోంది. నాగం చేరిక వల్ల పార్టీకి నష్టమేగానీ లాభం ఉండదంటూ డీకే అరుణ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీకి కూడా నాగం సమర్థతపై రిపోర్టులు ఇచ్చారు. పార్టీలో ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి… తన సత్తా చాటుకోవాల్సిన అవసరం నాగంకు ఏర్పడింది. అందుకే, స్వరం పెంచారు. ఎన్నికల ప్రచారం అన్నట్టుగా నాగర్ కర్నూల్లో పర్యటిస్తున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు. రేవంత్ స్థాయిలో కేసీఆర్ పై నిప్పులు చెరుగుతున్న నాగం సేవల అవసరాన్ని పార్టీ గుర్తిస్తుందా..? మరీ ముఖ్యంగా అసమ్మతి వర్గం ఆయన చేరికపై వ్యతిరేకతను తగ్గించుకుంటుందా అనేదే చూడాలి.