లాంఛనం పూర్తయింది. తెలంగాణ భాజపా నేత నాగం జనార్థన్ రెడ్డి భాజపాని వీడారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని పలువురు నేతలు ఢిల్లీ వెళ్లారు. నాగంతో పాటు గద్దర్ కుమారుడు సూర్యకిరణ్, వేములవాడకు చెందిన ఆది శ్రీనివాస్ కూడా పార్టీలో చేరారు. నాగంకి కండువా కప్పుతూ పార్టీలోకి రాహుల్ గాంధీ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ… నాగం పార్టీలోకి రావడం శుభ సూచకం అన్నారు.
నాగం మాట్లాడుతూ… రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రాలో పార్టీ నష్టపోతోందని తెలిసినా కూడా నాడు సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించారన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడ్డారని కొనియాడారు. కానీ, నేడు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీరలేదనీ, పేదరికం లేని తెలంగాణకు ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి, అధికారంలోకి వచ్చాక కేవలం దోపిడీ ఒక్కటే ప్రధానంగా పెట్టుకుని పాలిస్తున్న తెరాసను తుదముట్టించడం కోసమే తాను కాంగ్రెస్ లోకి చేరాను అన్నారు.
నిజానికి, భాజపాలో ఉండగా నాగం ఎదుర్కొన్న సమస్య ఇదే. తెరాసపై పోరాటం చేస్తామంటే, అందుకు కావాల్సిన స్వేచ్ఛను పార్టీ తనకు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆ వాదనతోనే నెమ్మదిగా భాజపాకి దూరమౌతూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే, కాంగ్రెస్ లో ఆయనకి సముచిత స్థానం ఉంటుందని ఉత్తమ్ చెబుతున్నారు. సముచితం అంటే… తెరాసపై పోరాడే స్వేచ్ఛ ఉంటుంది. కానీ, ఒక వ్యక్తిగా పోరాడే స్వేచ్ఛ కంటే… కాంగ్రెస్ పార్టీగా తెరాసపై పోరాటానికి మాత్రమే అక్కడ ఉంటుంది..! నిజానికి, జాతీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం అలానే ఉంటుంది. ప్రతీ నిర్ణయానికి అధిష్టానం ఆదేశాలూ అనుమతులూ అవసరమౌతాయి. తెలుగుదేశంలో ఉండగా ఆయనకి అలాంటి పరిస్థితి ఎదురుపడలేదు. పైగా, టీడీపీలో ఉండగా ఆయన అత్యంత కీలక నేతల్లో ఒకరు. అదే కీలక స్థానాన్ని ఆశిస్తూ.. భాజపాలో చేరేసరికి వెనక వరుసలో నిలబడాల్సి వచ్చింది. మరి, ఇప్పుడు టి. కాంగ్రెస్ లో ఆయన ఏ వరుసలో నిలబడతారో చూడాలి. ఏదేమైనా, పార్టీపరంగా కాంగ్రెస్ బలపడుతోందనే ప్రచారానికి నాగం చేరికను ఉదహరించుకునే అవకాశమైతే ఉంది. ఇదే క్రమంలో, తెలంగాణలో భాజపా వీక్ అవుతోందని విమర్శకీ ఆస్కారముంది.