భాజపా నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి మరోసారి వార్తల్లోకి వచ్చారు. తన రాజకీయ భవిష్యత్తుపై కొంత స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఆయన భాజపాలో ఉన్నారు. కానీ, కొన్నేళ్లుగా అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన పార్టీ మార్పుపై అడపాదడపా ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. అయితే, ఇప్పుడు అదే అంశమై కొంత స్పష్టత ఇవ్వడం విశేషం. తాను పార్టీ మారడంపై త్వరలోనే ఒక నిర్ణయం ఉంటుందని నాగం జనార్థన్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతానికైతే తాను భాజపాలోనే ఉన్నాననీ, కానీ తన అనుచరులూ కార్యకర్తలు మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో భాజపా నాయకత్వంపై తన వర్గీయులు చాలా అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఉగాది అనంతరం తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన కార్యాచరణ ప్రకటిస్తానని నాగం స్పష్టం చేశారు.
దీంతో ఆయన పార్టీ మార్పు తప్పదని అర్థమౌతోంది. కొన్నాళ్లుగా ఇమడలేకపోతున్న భాజపా నుంచి బయటకి రాబోతున్నట్టు స్పష్టంగానే చెప్పారు. కానీ, ఆయన ఏ పార్టీలో చేరతారనేది మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే, ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరారు. ఆయన బాటలోనే నాగం కూడా కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశాలున్నట్టుగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. నాగం కూడా రేవంత్ మాదిరిగానే టీడీపీలో పనిచేసినవారే కదా. నిజానికి, ఉమ్మడి రాష్ట్రంలో బాగా పేరున్న నేతగా నాగం ఒక వెలుగు వెలిగారు. ఆ తరువాత, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఉస్మానియా యూనిర్శిటీ ఘటన, తదనంతర పరిణామాల వల్ల నెమ్మదిగా పట్టుకోల్పోయారు. భాజపాలో చేరాక కూడా రాష్ట్ర నేతలది ఒకదారీ ఆయనది మరో దారీ అన్నట్టుగా మారింది.
నాగం మళ్లీ సొంత గూటికే తిరిగి వస్తారన్న చర్చ కొన్నాళ్లుగా ఉంది. వాస్తవంగా ఆలోచిస్తే, తెలంగాణలో వచ్చే ఎన్నికలు అధికార పార్టీ తెరాస వెర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉన్నాయి. తెలుగుదేశం ప్రస్థావనే ప్రస్తుతానికి లేదు. ఎన్నికల్లోపు అనూహ్యంగా పుంజుకునే వాతావరణం కూడా కనిపించడం లేదు. కాబట్టి, నాగం టీడీపీలోకి రావడం అనేది కొంత అనుమానమే. ఇలాంటి సమయంలో బలమైన పార్టీలోనైనా ఉండాలి.. లేదా, పార్టీలే పిలిచేంత సొంత బలమైనా ఉండాలి. ప్రస్తుతం నాగం జనార్థన్ రెడ్డికి రెండోది ఎలాగూ లేదు కాబట్టి, బలమైన పార్టీవైపు మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువ అని చెప్పొచ్చు. సో.. ఎలా చూసుకున్నా ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గే అవకాశాలే కనిపిస్తున్నాయి.