అనుకున్నట్టుగానే నాగం జనార్థన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి అధికారంగా దూరం అయ్యారు. ఇక, ఆయన పయనం కాంగ్రెస్ వైపు అనేది కూడా తెలిసిందే. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ అధినాయకత్వంతో చర్చించి వచ్చారు, స్థానికంగా ఉన్న కొంతమంది నాయకుల అండ కూడా ఉంది, అన్నిటికీ మించి టి. కాంగ్రెస్ నేతల్లోని సామాజిక వర్గ సమీకరణాలు కూడా ఆయనకి కొంత అనుకూలంగానే కనిపిస్తున్నాయి. మొత్తానికి, ఇన్నాళ్ల తన రాజకీయ జీవితమంతా ఏ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోరాడుతూ సాగిందో, ఇప్పుడు అదే పార్టీలోకి చేరేందుకు నాగం జనార్థన్ రెడ్డి సిద్ధం కావడం విశేషం! కాంగ్రెస్ అంటే మహా సముద్రమనీ, అందరూ చివరికి చేరాల్సింది అక్కడికే అనే అభిప్రాయాలు గతంలో ఉండేవి. ఇప్పుడు, మిగతా రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితి లేకపోయినా, తెలంగాణలో కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉన్నవారి గమ్యస్థానం కాంగ్రెస్ అన్నట్టుగానే మారిపోయింది.
ఇక, నాగం చేరిక కాంగ్రెస్ కి ఎంతవరకూ ఉపకరిస్తుంది అనే విషయానికొస్తే.. మహబూబ్ నగర్ లో స్థానికంగా నాగంకి మంచి గుర్తింపే ఉంది. తెలుగుదేశంలో ఉండగా ఆయనకి ప్రభుత్వంలో కూడా సముచిత స్థానం ఉండేది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేపథ్యంలో చోటు చేసుకున్న ఉస్మానియా ఘటన తరువాత నాగం ప్రతిష్ట కొంత మసకబారుతూ వచ్చింది. ఆ తరువాత, ఆయన టీడీపీకి దూరం కావడం… భాజపాలో చేరి, అక్కడ ఇమడలేకపోవడం అన్నీ జరిగాయి. ఇన్ని జరిగినా కూడా స్థానికంగా ఆయన పట్టుకోల్పోలేదనే అభిప్రాయం ఉంది. పైగా, ఆయనకి ఉన్న అనుభవం కాంగ్రెస్ కి కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
ఇదే సందర్భంలో ఆయన చేరికపై కాంగ్రెస్ లో కూడా కొన్ని లుకలుకలు ఉన్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి డీకే అరుణ ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాగంను చేర్చుకోవద్దనీ, దాని వల్ల స్థానికంగా పార్టీలో గ్రూపులు పెరుగుతాయని గతంలో ఢిల్లీకి వెళ్లి, హైకమాండ్ కి ఒక వర్గం ఫిర్యాదు చేసి వచ్చింది. ఆ తరువాత, డీకే అరుణను పలురువు నేతలు బుజ్జగించారనీ సమాచారం. దాంతో ఆమె నుంచి ప్రస్తుతానికి ఎలాంటి వ్యతిరేకతా లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే, నాగం కేడర్ లో కొంతమంది కాంగ్రెస్ పార్టీ చేరికను వ్యతిరేకిస్తున్నారనీ, ఆ సమస్యను నాగం సొంతంగా డీల్ చేసుకుంటారని అంటున్నారు. మొత్తానికి, కాంగ్రెస్ లో చేరికకు లైన్ క్లియర్ అయినట్టుగానే ప్రస్తుతానికి కనిపిస్తోంది. ఆయన చేరికపై పార్టీలో ఉన్న కొంత అసమ్మతి సద్దుమణిగినట్టు పైపైకి కనిపిస్తున్నా.. ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా మారుతుందనేది వేచి చూడాలి.