తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి హఠాత్తుగా.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. దాదాపుగా గంట సేపు.. చంద్రబాబుతో.. తెలంగాణ రాజకీయాలపై చర్చించారు. ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న నాగం… ఎన్నికల ఫలితాల తర్వాత.. ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఎన్నికల ప్రచారంలో.. తనకు ఇవే చివరి ఎన్నికలు అని కూడా ప్రకటించుకున్నారు. ఓడిపోవడంతో.. ఆయన ఇక రాజకీయాల్లో ఉండరేమో అనుకున్నారు. అయితే.. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి కొంత మంది టీడీపీ నేతలతో కలిసి వచ్చిన ఆయన… మంతనాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నాగం జనార్దన్ రెడ్డి ఇప్పుడు ఎవరికీ కాని నాయకుడయ్యారు కానీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన తెలుగుదేశం పార్టీలో… నెంబర్ టూ పొజిషన్లో ఉండేవారు. ఓబులాపురం మైనింగ్ విషయంలో.. గాలి జనార్ధన్ రెడ్డిపై పోరాటంలో.. ఆయన తెగువ చూపించారు. చంద్రబాబు కూడా ఆయనకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే.. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత.. టీడీపీ నుంచి వెళ్లిపోయిన నేతల్లో నాగం మొదటి వారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఆయనపై విద్యార్థుల పేరుతో.. కొంత మంది దాడి చేశారు. ఆ ఘటన తర్వాత.. కొన్నాళ్లకు టీడీపీ నుంచి విడిపోయి.. మొదటగా ఓ వేదికను పెట్టారు. తర్వాత పార్టీ పెట్టారు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో బీజేపీలో చేరారు. అక్కడ కూడా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో.. గత ఎన్నికలకు ముందు జైపాల్ రెడ్డి సాయంతో కాంగ్రెస్లో చేరి .. నాగర్ కర్నూలు నుంచి మళ్లీ పోటీ చేశారు. కానీ ఫలితం మాత్రం మారలేదు.
కేసీఆర్తో ఉన్న రాజకీయ వైరం… కారణంగా గతంలో ఆయన పార్టీలో చేరలేకపోయారు. ఇప్పుడు చేర్చుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్లో ఇమడలేకపోతున్నారు. మళ్లీ బీజేపీలోకి వెళ్తామన్నా.. పిలిచేవాళ్లు లేకపోవచ్చు. ఈ క్రమంలో.. తన మాతృపార్టీ అయితే.. తనకు సౌకర్యంగా ఉంటుందన్న భావనలో జనార్దన్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ పార్టీ నేతగా.. గుర్తింపు అయినా ఉంటుందని.. వచ్చే ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితిని బట్టి .. నిర్ణయం తీసుకునే చాన్స్ కూడా ఉంటుందని అంచనా వేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఆయన ఉద్దేశం కరెక్టే అయితే నాగం.. టీడీపీలో చేరినా ఆశ్చర్యపోనక్కరలేదు. అదే జరిగితే.. తెలంగాణ తెలుగుదేశానికి మంచి పరిణామమే.