టిడిపి నుంచి నిష్క్రమించి.. నగారా అంటూ పెట్టి తర్వాత బిజెపిలో కలసి.. ఆపైన అక్కడా అసంతృప్తి ప్రకటించిన మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి ఎట్టకేలకు పార్టీ నాయకుల బుజ్జగింపులతో సర్దుకున్నారు.బిజెపి కార్యాలయంలోనే మీడియా మీట్లు నిర్వహిస్తున్నారు. ఒరిజినల్ బిజెపి నేతలకు ఇదంతా చికాకుగా వున్నా భరిస్తున్నారు. ఇటీవల బిజెపి సమావేశాల సందర్బంలో ప్రధాని మోడీ నాగంను దగ్గర నుంచి ఆసక్తిగా మాట్లాడిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. మోడీ అంత సన్నిహితంగా మాట్లాడ్డం నాగంకు క్రెడిటే కదా.. ఇంతకూ మోడీ ఏమంటున్నారు ఎందుకు నవ్వుతున్నారంటే- నాగంను పలకరించి అంతా మా అమిత్ షాలానే వున్నావే అన్నారట మోడీ. తామిద్దరికి కొన్ని పోలికలు వున్నాయని నాగం కూడా అనుకుంటున్నారు. తెలంగాణలో దూకుడుగా వెళ్లాల్సిందే. ఏమీ తటపటాయించొద్దు అని మోడీ ఆయనకు భరోసా ఇచ్చారట. వైఎస్ హయాంలో ప్రతిపక్ష ఉప నేతగా నాగం ఎంత గట్టిగా పనిచేశానో మోడీ తెలుసుకుని వుంటారని ఆయన మిత్రులు చెబుతున్నారు. ఏమైతేనేం ఆయన మాట్లాడించి గో అహెడ్ అని చెప్పడం నాగంకు ఏనుగెక్కినంత సంతోషంగా వుందట. ఇక మళ్లీ దూకుడు మొదలుపెడతారనే అనుకుంటున్నారు. సమస్యలు అధ్యయనం చేయడంలోనూ ప్రాజెక్టులు అవినీతి వ్యవహారాల సమాచారంలోనూ నాగంకు మంచి పట్టు వుంటుందని పేరు. మరి ఈ అమిత్ నాగంషా ఎలా విజృంభిస్తారో చూడాలి మరి!