ఈవారం ఏకంగా అరడజను సినిమాలు విడుదలకు వచ్చేశాయి. నగరం, లక్ష్మీబాంబ్, చిత్రాంగద, ఆకతాయి, 16… ఇలా బాక్సాఫీసు దగ్గర సినిమాల సందడి కనిపిస్తోంది. విచిత్రం ఏంటంటే.. ఒక్క సినిమాకీ సరైన పబ్లిసిటీ లేదు. సందీప్ కిషన్ ఓ మోస్తరు హీరోనే. తన సినిమా అనేసరికి కనీసం మల్టీప్లెక్స్ ఆడియన్స్ అయినా ఇంట్రస్ట్ చూపిస్తారు. కానీ.. సందీప్ నటించిన నగరం సినిమా జీరో ప్రమోషన్లతో విడుదలైంది. ఇంటర్వ్యూలూ, ప్రెస్ మీట్లూ లేకుండా విడుదలైన సందీప్ సినిమా ఇదేనేమో. దొంగాటతో మంచు లక్ష్మికి ఓ హిట్టు దొరికింది. ఆ సినిమా తరవాత లక్ష్మీబాంబ్ చేసింది. ఈ సినిమా చాలాసార్లు విడుదల తేదీ ప్రకటించి… వెనక్కి వెళ్లిపోయింది. ఈనెల 10న ఈ సినిమా వస్తోందని దర్శక నిర్మాతలు చెప్పినా.. జనాలకు నమ్మకం లేదు. అలాంటప్పుడు పబ్లిసిటీ కాస్త గట్టిగా చేయాల్సింది. కానీ… లక్ష్మీబాంబ్ కూడా పబ్లిసిటీ విషయంలో తుస్సుమనిపించింది.
ఆకతాయి అనే మరో సినిమా ఈవారమే వచ్చింది. చిన్న హీరో సినిమా ఇది. అయినా సరే. సినిమా కోసం బాగా ఖర్చు పెట్టారు. ఆడియో కూడా గట్టిగానే చేశారు. అయితే.. విడుదలకు ముందు మాత్రం నిర్మాతలు చేతులు ఎత్తేశారు. రెహమాన్ నటించిన 16, అంజలి సినిమా చిత్రాంగద కూడా ప్రమోషన్లు లేకుండానే విడుదల అయిపోయాయి. ఈ ఎఫెక్ట్ బాక్సాఫీసు దగ్గర భారీగా పడే అవకాశాలున్నాయి. ఈ రోజుల్లో సినిమా తీయడం తో పాటు.. ప్రమోషన్లు చేసుకోవడం కూడా ముఖ్యమే. ఆ విషయంలో ఈవారం వచ్చిన సినిమాలు బాగా వెనకబడ్డాయి. ఓవర్ కాన్ఫిడెన్సా?? లేదంటే ఎంత పబ్లిసిటీ ఇచ్చినా ఈ సినిమాల్ని జనం చూడరన్న నమ్మకానికి నిర్మాతలు ముందే వచ్చేశారా??