సమాజంపై, ముఖ్యంగా యువతరంపై సినిమాల ప్రభావం ఎంత? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే. ఎప్పటికీ తెగని పంచాయితీ మొదలవుతోంది. సినిమాల వల్ల సమాజంలో యువత చెడుదారిలో ప్రయాణిస్తుందనీ, సినిమాల్లో శృంగారం మోతాదు శ్రుతి మించుతోందనీ కొందరు సినిమా ఇండస్ట్రీని విమర్శిస్తుంటారు. ‘అర్జున్‌రెడ్డి’, ‘ఆర్ఎక్స్100’ సినిమాలపై కొందరు చేసిన ఆందోళనలు, తెలుగులో ఆ సినిమాలు సృష్టించిన సంచలనాలను ఎవరూ మరువలేరు. ఇటువంటి సినిమాలు వచ్చిన ప్రతిసారీ చర్చ మళ్ళీ మొదటికి వస్తుంది.
సినిమాల్లో చూపించేదాని కంటే సమాజంలో ఎక్కువ జరుగుతున్నాయని ఇండస్ట్రీ జనాలు వ్యాఖ్యానిస్తుంటారు. సినిమాలకు వచ్చేసరికి ఎందుకీ గోల అని విస్మయం వ్యక్తం చేస్తుంటారు. ప్రముఖ హీరో నాగార్జున కూడా ఇటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తాజాగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుటుంబంతో కలిసి చూసేందుకు కొన్ని చిత్రాలు అనువుగా లేవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని ఆయన్ను ప్రశ్నించగా… “కుటుంబంతో ఈ సినిమా చూడలేమని అనుకున్నప్పుడు పిల్లల్ని తీసుకువెళ్లకుండా వుండటమే మంచిది. కుటుంబమంతా కలిసి చూడొచ్చని అనుకుంటే పిల్లలతో కలిసి వెళ్ళండి. ఈరోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు వుంటున్నాయి. పిల్లలకూ ఫోన్లు ఇస్తున్నారు. ఒక్క బటన్ నొక్కితే ఇంటర్నెట్ ఓపెన్ అవుతుంది. అక్కడ అన్నీ ఓపెనే. ఇంటర్నెట్‌ని ఏం చేయలేకపోతున్నారు. సినిమాలకు వచ్చేసరికి హడావుడి పడుతుంటారు. పిల్లలు చెడిపోతున్నారని అంటారు. ఇదెక్కడి గొడవో నాకు అర్థం కాదు. ‘అర్జున్‌రెడ్డి’, ‘ఆర్ఎక్స్100’, ‘చిలసౌ’, ‘మహానటి’, ‘గూఢచారి’,’గీత గోవిందం’ సినిమాలు నచ్చాయి. ‘ఆర్ఎక్స్100’ పాటల్లో సాహిత్యం బావుంది” అన్నారు.